మార్చి 3న ఏర్పడే చంద్రగ్రహణం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక నియమాలు అమలు చేయనున్నారు. సాధారణంగా గ్రహణం ప్రారంభానికి ముందు ఆలయాలు మూసివేసి, గ్రహణం ముగిసిన తర్వాత శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఆ మేరకు పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయం మార్చి 3న ఉదయం 6.30 గంటల లోపు ప్రాతఃకాల అర్చనలు పూర్తి చేసి ఆలయాన్ని మూసివేస్తారు. అనంతరం రాత్రి 7.30 గంటలకు ఆలయాన్ని తిరిగి తెరిచి శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. గ్రహణం కారణంగా ఆర్జిత సేవలు, దర్శనాలను రద్దు చేసిన అధికారులు, మార్చి 4 నుంచి యథావిధిగా అన్ని సేవలు, దర్శనాలను పునరుద్ధరించనున్నారు. చిన్న ఆలయాల నుంచి ప్రముఖ క్షేత్రాల వరకు ఈ నియమాలు పాటించడం పరిపాటిగా ఉంది.
అయితే ఈ సంప్రదాయానికి భిన్నంగా కేరళ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లాలో ఉన్న తిరువార్పు శ్రీకృష్ణ ఆలయం మాత్రం గ్రహణ సమయంలో కూడా మూసివేయరు. సుమారు 1500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పురాతన ఆలయంలో మహాభారత కాలంలో పాండవులే విగ్రహాన్ని ప్రతిష్ఠించారని స్థానిక విశ్వాసం. కేరళలో ప్రముఖ కృష్ణక్షేత్రాలలో ఇది ఒకటి. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు బాలరూపంలో కొలువై ఉంటారు. “బాలుడిని ఆకలితో ఉంచకూడదు” అనే విశ్వాసంతో ఎప్పుడూ ఆలయ ద్వారాలు మూయరని చెబుతారు. గ్రహణ సమయాల్లో కూడా పూజలు కొనసాగుతాయి. దేవుడికి అన్నం, బియ్యం, బెల్లం, నెయ్యి, అరటిపండ్లు, ఎండు కొబ్బరి వంటి పదార్థాలతో తయారైన నైవేద్యాన్ని సమర్పిస్తారు. రోజుకు ఐదు సార్లు పూజలు, పది సార్లు భోగ సమర్పణ జరుగుతుంది. ఇక్కడ మరో ప్రత్యేక ఆచారం ఉంది. స్వామివారికి భోగం సమర్పించేందుకు గర్భగుడిలోకి వెళ్లే పూజారి చేతిలో కత్తి తీసుకెళ్తారు. భోగ సమర్పణ సమయంలో గర్భగుడి తలుపులు మూసివేస్తారు. ఏదైనా కారణంతో తలుపులు వెంటనే తెరుచుకోకపోతే ఆలస్యం లేకుండా తాళం విరగగొట్టి స్వామికి భోగం సమర్పించాలనే ఉద్దేశంతో ఈ కత్తిని వెంట తీసుకెళ్తారు. ఈ విధంగా గ్రహణ సమయంలో కూడా నిరంతర పూజా కార్యక్రమాలు కొనసాగించడం ఈ ఆలయానికి ప్రత్యేకతగా నిలుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.