ఫాల్గుణ పౌర్ణమి చంద్రగ్రహణం: దోషాలు తొలగించి.. శుభ ఫలితాలు ఇచ్చే శక్తివంతమైన రెమెడీ ఇదే..!

ఫాల్గుణ పౌర్ణమి చంద్రగ్రహణం: దోషాలు తొలగించి.. శుభ ఫలితాలు ఇచ్చే శక్తివంతమైన రెమెడీ ఇదే..!


ఫాల్గుణ పౌర్ణమి పవిత్ర రోజున ఏర్పడే చంద్రగ్రహణం మానవ జీవితాలపై చూపగల ప్రభావాలను, వాటిని నివారించడానికి ఆచరించాల్సిన ఒక ప్రత్యేక రెమెడీని కేరళలోని శ్రీ షడ్ శాస్త్ర అయ్యప్ప కోవెల శివ నరసింహన్ తాంత్రి వివరంగా తెలియజేశారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి సంవత్సరము సాధారణంగా రెండు చంద్రగ్రహణాలు, రెండు సూర్యగ్రహణాలు సంభవిస్తాయని ఆయన వివరించారు. సూర్య చంద్రుల మధ్య భూమి వచ్చినప్పుడు గ్రహణం ఏర్పడుతుందని, ఈ సమయంలో వెలువడే ప్రత్యేకమైన కిరణాలు, వైబ్రేషన్లు భూమిపై ఉన్న గ్రహాలు, నక్షత్రాలు, జీవుల మీద ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు.

ఆ రాశివారికి కొద్ది సమస్యలు..

నవగ్రహాలు, 27 నక్షత్రాలతో అనుసంధానితమై ఉన్న పన్నెండు రాశుల వారికి ఈ గ్రహణ ప్రభావాలు వేర్వేరుగా ఉంటాయని గురువు తెలిపారు. కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు రాగా, మరికొందరికి మధ్యస్థంగా లేదా కొన్ని సమస్యలను కలిగించే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ సంవత్సరము చంద్రగ్రహణం భారతదేశంలో పగటిపూట (ఉదయం 9:10 నుంచి మధ్యాహ్నం 2-3 గంటల వరకు) సంభవిస్తుంది కాబట్టి, సాధారణంగా ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదని భావిస్తారు. అయితే, సూర్య చంద్రులు ఏ దేశంలో ఉన్నా అందరికీ సంబంధించినవని, గ్రహ ప్రభావాలు సార్వత్రికమని ఆయన నొక్కి చెప్పారు. భూమిపై ఉన్న మానవులందరూ 12 రాశులు, 9 గ్రహాలు, 27 నక్షత్రాల ప్రభావాలకు లోబడి ఉంటారని, కాబట్టి గ్రహణం ఎక్కడ ఉన్నా దాని ప్రభావం ఉంటుందని ఆయన వివరించారు. ముఖ్యంగా సింహ రాశిలో పుబ్బ నక్షత్రంలో ఏర్పడే ఈ కేతు గ్రస్త చంద్రగ్రహణం ఆ రాశి వారికి కొద్దిగా సమస్యలను కలిగించవచ్చని తెలిపారు.

ఇదే శక్తివంతమైన రెమెడీ..

ఈ ప్రతికూల ప్రభావాలను తొలగించి, చెడును మంచిగా మార్చుకోవడానికి ఒక శక్తివంతమైన రెమెడీని ఆయన సూచించారు. గ్రహణ సమయంలో ఒక గాజు బౌల్ లేదా పింగాణి పాత్రను తీసుకోవాలి. స్టీలు, పిత్తడి, రాగి పాత్రలను ఉపయోగించకూడదు. ఈ పాత్రలో ఒక శంఖు, కొన్ని ముత్యాలు, ఒక తెల్ల చందనం స్టిక్ వేయాలి. అనంతరం అందులో గంగాజలం పోసి, అవసరమైతే మరికొంత సాధారణ నీటిని కూడా కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని గ్రహణం సమయం మొత్తం అలాగే ఉంచాలి. గ్రహణం ముగిసిన తర్వాత, ఈ నీటిని స్నానం చేసే బకెట్ లేదా టబ్‌లో కలుపుకొని స్నానం చేయాలి.

దోషాలు తొలిగిపోయి..

ఈ ప్రక్రియ ద్వారా చంద్రగ్రహణం వల్ల కలిగే దోషాలు తొలగిపోయి, ప్రతికూల ప్రభావాలు సానుకూల శక్తిగా మారుతాయని గురువు వివరించారు. ఈ పద్ధతి గ్రహణ కిరణాల వల్ల ఏర్పడిన ప్రతికూలతను శుద్ధి చేయడానికి సహాయపడుతుందని, తద్వారా జీవితంలో మంచి జరిగి విజయాలు లభిస్తాయని ఆయన తెలియజేశారు. ఇది కేవలం ఒక స్నానపు ప్రక్రియ కాదని, గ్రహణ ప్రభావాలను ఎదుర్కోవడానికి నీటిని శక్తివంతంగా మార్చే ఒక ఆయుర్వేద, తాంత్రిక విధానమని పేర్కొన్నారు.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *