ఆదివారమే హాలిడే ఎందుకు..? సండే సెలవు వెనుక ఇంత పెద్ద కథ ఉందా..

ఆదివారమే హాలిడే ఎందుకు..? సండే సెలవు వెనుక ఇంత పెద్ద కథ ఉందా..


వారమంతా ఆఫీసు పనులు, ఒత్తిళ్లతో గడిపే మనకు ఆదివారం అనే మాట వింటేనే మనసు తేలికపడుతుంది. కానీ ఈ ఒక్క రోజు సెలవు కోసం ఒకప్పుడు భారతీయ కార్మికులు ఏడేళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేశారని మీకు తెలుసా? ఒకప్పుడు దేశంలోని మిల్లుల్లో ముఖ్యంగా ముంబై వస్త్ర పరిశ్రమలో కార్మికుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేది. వారంలో ఏడు రోజులు, సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు వారు పని చేయాల్సిందే. కనీసం విశ్రాంతి తీసుకోవడానికి లేదా కుటుంబంతో గడపడానికి ఒక్క రోజు కూడా విరామం ఉండేది కాదు. ఈ క్రమంలో కార్మికుల ఆరోగ్యం క్షీణించడం గమనించిన నారాయణ్ మేఘాజీ లోఖండే, వారి తరపున గొంతు ఎత్తారు.

లోఖండే పోరాటం – కార్మిక విజయం..

జ్యోతిరావు ఫూలే అనుచరుడైన లోఖండే 1880లలో బాంబే మిల్ హ్యాండ్స్ అసోసియేషన్‌ను స్థాపించి బ్రిటీష్ ప్రభుత్వంతో పోరాటం మొదలుపెట్టారు. వారానికి ఒకరోజు విశ్రాంతి ఉండాలనేది వారి ప్రధాన డిమాండ్. ఈ పోరాటం సుమారు 7 ఏళ్ల పాటు సాగింది. చివరకు బ్రిటీష్ ప్రభుత్వం లొంగక తప్పలేదు. జూన్ 10, 1890న ఆదివారాన్ని అధికారికంగా వారపు సెలవు దినంగా ప్రకటించారు. అందుకే లోఖండేను భారత కార్మిక ఉద్యమ పితామహుడు అని పిలుస్తారు.

ఆదివారాన్నే ఎందుకు ఎంచుకున్నారు?

దీని వెనుక ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తాయి.

బ్రిటీష్ సంప్రదాయం: క్రైస్తవ మతాచారాల ప్రకారం ఆదివారం ప్రార్థనా దినం. బ్రిటీష్ వారు ఆ రోజు చర్చికి వెళ్లేవారు కాబట్టి వారు కూడా అదే రోజును సెలవుగా నిర్ణయించారు.

భారతీయ విశ్వాసం: హిందూ ధర్మం ప్రకారం ఆదివారం సూర్య భగవానుడికి ప్రీతికరమైన రోజు. అటు క్రైస్తవ, ఇటు హిందూ విశ్వాసాలకు సరిపోతుందని ఈ నిర్ణయం తీసుకున్నారు.

అంతర్జాతీయ ప్రాచుర్యం: క్రీ.శ. 321లో రోమన్ చక్రవర్తి కాన్‌స్టాంటైన్ ది గ్రేట్ మొదటగా ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించారు. ఆ పద్ధతినే బ్రిటీష్ వారు తమ వలస దేశాల్లో అమలు చేశారు.

ఇతర సౌకర్యాలు కూడా ఆరోజే..

కేవలం సెలవు మాత్రమే కాదు పని మధ్యలో అరగంట భోజన విరామం, ప్రతి నెల 15వ తేదీలోపు జీతం ఇవ్వాలనే నిబంధనలు కూడా లోఖండే పోరాటం వల్లే సాధ్యమయ్యాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *