Hyderabad: 3 రోజుల క్రితం ప్రేమ పెళ్లి.. ఇంతలో అమ్మాయి ఫోన్ నుండి అబ్బాయికి మెసేజ్.. కట్ చేస్తే..

Hyderabad: 3 రోజుల క్రితం ప్రేమ పెళ్లి.. ఇంతలో అమ్మాయి ఫోన్ నుండి అబ్బాయికి మెసేజ్.. కట్ చేస్తే..


యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో యువకుడిపై హత్యాయత్నం చేసిన దారుణ ఘటన బొమ్మలరామారం మండలంలో వెలుగులోకి వచ్చింది. మూడు రోజుల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న యువ దంపతుల జీవితంలో విషాదం నెలకొంది. నేరెడ్‌మెట్‌కు చెందిన అజయ్, రామలింగంపల్లికి చెందిన యువతిని గత కొంతకాలంగా ప్రేమించుకుంటూ వచ్చాడు. కుటుంబ సభ్యుల అనుమతి లేకపోయినా ఇటీవల ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఈ వివాహం యువతి కుటుంబానికి, ముఖ్యంగా ఆమె సోదరుడికి తీవ్ర ఆగ్రహాన్ని కలిగించినట్లు తెలుస్తోంది.

బుధవారం యువతి మొబైల్ ఫోన్ నుండి రామలింగంపల్లికి రావాలంటూ అజయ్‌కు మెసేజ్ వెళ్లింది. తన ప్రియురాలే పిలుస్తోందని నమ్మిన అజయ్ అక్కడికి వెళ్లాడు. అయితే అది పన్నిన పన్నాగమని అతనికి తెలియదు. గ్రామ శివార్లకు చేరుకున్న వెంటనే యువతి సోదరుడు, అతని స్నేహితులు అజయ్‌పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ముందుగా అతని కళ్లలో కారం చల్లి, అనంతరం కత్తులతో దాడి చేశారు. సమాచారం ప్రకారం అజయ్‌పై దాదాపు 14 సార్లు కత్తితో పొడిచినట్లు తెలుస్తోంది.

తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో పడిపోయిన అజయ్‌ను చనిపోయాడని భావించిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని అజయ్‌ను అత్యవసర చికిత్స కోసం హైదరాబాద్‌లోని గాందీ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం అజయ్ చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు యువతి సోదరుడు, అతని స్నేహితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రేమ వివాహం కారణంగా చోటుచేసుకున్న ఈ దారుణం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *