క్రికెట్ ప్రపంచంలో సుదీర్ఘ కాలం పాటు తనదైన ముద్ర వేసుకున్న ప్రముఖ అంపైర్ హెరాల్డ్ ‘డిక్కీ’ బర్డ్ 92 ఏళ్ల వయసులో మరణించారు. ఆయన మరణాన్ని యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ అధికారికంగా ప్రకటించింది. క్రికెట్ ఆటగాళ్ల, అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న డిక్కీ బర్డ్ శాశ్వతంగా కన్నుమూశారని ఆ క్లబ్ ఒక ప్రకటనలో తెలిపింది.
క్రికెటర్‌గా మొదలై.. అంపైర్‌గా దిగ్గజంగా ఎదిగి..
డిక్కీ బర్డ్ ఒకప్పుడు ఫస్ట్-క్లాస్ క్రికెటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. 1956లో యార్క్‌షైర్ జట్టు తరఫున ఆడిన ఆయన, ఆ తర్వాత లీసెస్టర్‌షైర్ జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించారు. అయితే, మోకాలి గాయం కారణంగా ఆయన ఆటగాడిగా కెరీర్‌ను కొనసాగించలేకపోయారు. దీంతో అంపైర్‌గా కొత్త ప్రయాణం ప్రారంభించి, క్రికెట్ చరిత్రలో అత్యంత గౌరవనీయమైన అంపైర్‌లలో ఒకరిగా నిలిచిపోయారు.
ఇవి కూడా చదవండి
అత్యంత ప్రజాదరణ పొందిన అంపైర్
డిక్కీ బర్డ్ 1973 నుంచి 1996 వరకు సుదీర్ఘ కాలం పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో అంపైర్‌గా వ్యవహరించారు. ఆయన మొత్తం 66 టెస్టులు, 69 వన్డే మ్యాచ్‌లకు అంపైరింగ్ చేశారు. ఇందులో మూడు ప్రపంచ కప్ ఫైనల్స్ కూడా ఉన్నాయి. అంపైరింగ్‌లో ఆయన నిర్ణయాలు చాలా ఖచ్చితంగా ఉండేవి. ఆయన తీసుకున్న నిర్ణయాలపై ఆటగాళ్లకు పూర్తి విశ్వాసం ఉండేది. క్రీడా స్ఫూర్తి, హాస్యం, ప్రత్యేకమైన శైలితో ఆయన ఆటగాళ్లకు, ప్రేక్షకులకు కూడా చాలా ఇష్టమైన వ్యక్తిగా మారారు.
గుర్తుండిపోయే క్షణాలు
డిక్కీ బర్డ్ కెరీర్‌లో అనేక మర్చిపోలేని సంఘటనలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది, 1996లో లార్డ్స్‌లో భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్. అదే మ్యాచ్‌తో భారత దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు. ఆ మ్యాచ్ డిక్కీ బర్డ్‌కు కూడా చివరి టెస్ట్ మ్యాచ్. ఆయన మ్యాచ్‌లోకి అడుగుపెడుతుండగా, ఇరు జట్ల ఆటగాళ్లు గౌరవప్రదమైన ‘గార్డ్ ఆఫ్ హానర్’ ఇచ్చారు. ఆ క్షణం చూసి డిక్కీ బర్డ్ భావోద్వేగానికి గురయ్యారు. ఆ దృశ్యం క్రికెట్ అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది.
డిక్కీ బర్డ్ కేవలం అంపైర్‌గానే కాకుండా, క్రీడా ప్రపంచంలో ఒక గొప్ప వ్యక్తిగా కూడా నిలిచిపోయారు. ఆయనకు 1986లో ఎం.బి.ఇ, 2012లో ఓ.బి.ఇ అవార్డులు లభించాయి. ఆయన స్వస్థలమైన బర్న్స్‌లీలో ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. క్రికెట్ ప్రపంచానికి ఆయన చేసిన సేవలు, ఆయన నిష్పక్షపాతమైన నిర్ణయాలు, హాస్యభరిత వ్యక్తిత్వం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..