18 Years of Gamyam: గాలి శీను గుర్తున్నాడా? తెలుగులో వచ్చిన ఫీల్‌ గుడ్‌ మూవీకి 18 వసంతాలు!

18 Years of Gamyam: గాలి శీను గుర్తున్నాడా? తెలుగులో వచ్చిన ఫీల్‌ గుడ్‌ మూవీకి 18 వసంతాలు!


18 Years of Gamyam: గాలి శీను గుర్తున్నాడా? తెలుగులో వచ్చిన ఫీల్‌ గుడ్‌ మూవీకి 18 వసంతాలు!

కేవలం ఒక సినిమాగా కాకుండా, జీవిత సత్యాన్ని బోధించే ఒక ప్రయాణంలా సాగే ‘గమ్యం’ సినిమా విశేషాలేంటో తెలుసుకుందాం. అతను ఒక అపర కుబేరుడి కొడుకు.. విలాసవంతమైన జీవితం, అహంకారం తప్ప మానవత్వం అంటే తెలియదు. తన ప్రేమను వెతుక్కుంటూ బయలుదేరిన ఆ ధనవంతుడికి, దారిలో ఒక పక్కా లోకల్ దొంగ పరిచయం అవుతాడు. ఒకరు కాస్ట్లీ బైక్ పై ఉంటే, మరొకరు పాత బండిపై అతని వెనుక ప్రయాణిస్తారు. ఆ ప్రయాణంలో ఎదురైన మనుషులు, జరిగిన సంఘటనలు ఆ ధనవంతుడి ఆలోచనలను ఎలా మార్చాయి? చివరకు అతను చేరుకున్న గమ్యం ఏది? అనే కథాంశంతో వచ్చి ప్రేక్షకుల కళ్లు చెమర్చేలా చేసిన ఆ అద్భుత చిత్రం ‘గమ్యం’.

దర్శకుడు క్రిష్ తన మొదటి సినిమాతోనే టాలీవుడ్‌లో ఒక ప్రకంపన సృష్టించారు. ఒక రోడ్ మూవీని ఇంత లోతైన అర్థంతో తీయవచ్చని ఆయన నిరూపించారు. “మనిషి అంటే ఎవరు? మనిషి ఎక్కడుంటాడు?” అనే తాత్విక చింతనను కథలో అంతర్లీనంగా చూపించి అందరినీ ఆలోచింపజేశారు. లీపు సంవత్సరం రోజైన ఫిబ్రవరి 29, 2008న విడుదలైన ఈ సినిమా, అప్పట్లో చిన్న చిత్రంగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకుంది.

అల్లరి నరేష్ విశ్వరూపం..

సినిమాలో అల్లరి నరేష్ పోషించిన ‘గాలి శీను’ పాత్ర తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఒక దొంగ పాత్రలో ఆయన పండించిన కామెడీ, ఎమోషన్ ప్రేక్షకులను కట్టిపడేసింది. అల్లరి నరేష్ కెరీర్‌లో ఇది ఒక గొప్ప మలుపు. అలాగే అభిరామ్ పాత్రలో శర్వానంద్ ఎంతో హుందగా నటించి మెప్పించారు. వీరిద్దరి మధ్య సాగే సంభాషణలు సినిమాకు ప్రాణం పోశాయి. కమలిని ముఖర్జీ తన సహజ నటనతో జానకి పాత్రకు పూర్తి న్యాయం చేసింది.

ఇళయరాజా బాణీలు, సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. “ఎంతవరకు ఎందుకొరకు ఈ పయనం.. ఎవరి కోసమో ఎటు వైపుకో ఈ గమనం” అనే పాట వింటుంటే తెలియకుండానే ఒక రకమైన ఆనందం, ఆలోచన కలుగుతాయి. ప్రతి అడుగులో జీవిత పాఠాలను నేర్పే ఈ పాట, నేటికీ ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది. ఈ చిత్రానికి బెస్ట్ సినిమాగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా దక్కడం విశేషం. 18 ఏళ్లు గడిచినా ‘గమ్యం’ సినిమాలోని తాజాదనం ఏమాత్రం తగ్గలేదు. మనిషి విలువను, స్నేహాన్ని, సమాజంలోని నిజాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన ఈ సినిమా ఎప్పటికీ ఒక క్లాసిక్ గా నిలిచిపోతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *