స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నట్టా.. లేనట్టా..? హైకోర్టు వ్యాఖ్యలతో మళ్లీ సస్పెన్స్ !

స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నట్టా.. లేనట్టా..? హైకోర్టు వ్యాఖ్యలతో మళ్లీ సస్పెన్స్ !


స్థానిక సమరానికి సై అంటోంది రేవంత్‌ ప్రభుత్వం…! ఇటు ఎన్నికలు నిర్వహించేందుకు తామూ సిద్ధమేనంటోంది ఎన్నికల సంఘం. అయినా లోకల్‌ బాడీ ఎలక్షన్స్‌ గాల్లో దీపమేనా..? రిజర్వేషన్లపై జీవో రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. ఎన్నికలను కావాలంటే వాయిదా వేసుకోమడనడం దేనికి సంకేతం..? ఇప్పుడివే ప్రశ్నలు చర్చనీయాంశమయ్యాయి.. తెలంగాణ ప్రజానీకాన్ని సస్పెన్స్‌లో పడేశాయి..!

మాట తప్పేదేలేదు..! మడమ తిప్పేదేలేదు..! బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సమరానికి వెళ్తాం.. సత్తా ఏంటో చూపిస్తామంటూ మాంచి దూకుడు మీదుంది రేవంత్‌ ప్రభుత్వం. అన్నట్లుగానే రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం సీలింగ్‌ ఎత్తేయడమే కాదు… రిజర్వేషన్ల అమలుకు జీవో కూడా జారీ చేసింది. ఇటు స్టేట్‌ ఎలక్షన్‌ కమిషన్‌ సైతం ఎన్నికల నిర్వహణకు ఉవ్విళ్లూరుతోంది. ఏ క్షణంలోనైనా ఎన్నికలకు నోటిఫికేషన్‌ వస్తుందన్న సంకేతాలిస్తోంది. ఇలా లోకల్‌ వార్‌పై రోజుకో అప్‌డేట్‌ వస్తుండగా… ఉన్నట్టుండి బిగ్ ట్విస్ట్‌ వచ్చి పడింది. ప్రభుత్వ జీవోను సవాల్‌ చేస్తూ వేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించిన తీరు చర్చనీయాంశమైంది.

గవర్నర్‌ దగ్గర బిల్లు పెండింగ్‌లో ఉన్నప్పుడు జీవో ఎలా ఇస్తారు..? 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండకూడదన్న విషయం తెలియదా..? అంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టులో మరోసారి సవాల్‌ చేశారు రెడ్డి జాగృతి మాధవరెడ్డి. జీవోను రద్దు చేయాల్సిందేనంటూ ఆయన తరుపు లాయర్ వాదనలు వాదించారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మూడు తీర్పులనూ హైకోర్టులో ప్రస్తావించారు.

ఇటు ప్రభుత్వ తరుపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్.. బీసీలకు న్యాయం చేసేందుకే జీవో ఇచ్చామని కోర్టుకు తెలిపారు. రిజర్వేషన్లపై గతంలో పలు కోర్టుల నిర్ణయాలను హైకోర్టులో ప్రస్తావించారు. వెకేషన్ బెంచ్ కాకుండా రెగ్యులర్ బెంచ్‌లో విచారించాలని కోర్టును కోరారు ఏజీ. సెప్టెంబర్‌ 30లోపు ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశిందన్న విషయాన్ని లేవనెత్తారు.

ఇక ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్‌ దగ్గర బిల్లు ఉన్నప్పుడు జీవో ఇవ్వడం సరికాదంది. అవసరమైతే మరో 2, 3నెలల సమయం కోరుతూ అఫిడవిట్‌ వేసుకోవాలని సలహా ఇచ్చింది. దీనిపై స్పందించిన ఏజీ… ప్రభుత్వ నిర్ణయానికి రెండ్రోజుల సమయం కావాలన్నారు. అలాగే నోటిఫికేషన్‌ ఎప్పుడు ఇస్తారని ఈసీని హైకోర్టు అడ్గగా… ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్‌ ఇస్తామని ఈసీ రిప్లై ఇచ్చింది. ఒకవేళ నోటిఫికేషన్‌ వచ్చినా విచారిస్తామని స్పష్టం చేసింది న్యాయస్థానం.

మొన్నటిదాకా ఇదిగో నోటిఫికేషన్‌ అదిగో నోటిఫికేషన్ అంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడేమో కావాలంటే ఎన్నికలు వాయిదా వేసుకోవచ్చని హైకోర్టు సలహా ఇస్తోంది. అంతేకాదు ప్రభుత్వ నిర్ణయానికి రెండ్రోజుల సమయాన్ని కేటాయించింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలపై సస్పెన్స్‌ నెలకొంది. మరి ప్రభుత్వం ఏం చేయబోతోంది…? ఈసీ ఎలా ముందుకెళ్లనుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *