
ప్రస్తుతం నెలకొన్న వంట గ్యాస్ సంక్షోభం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. మరోవైపు పెరుగుతున్న వంట గ్యాస్ ధరలు సామాన్యుల బడ్జెట్‌ను తలకిందులు చేస్తున్నాయి. అయితే మన వంటగదిలో చేసే చిన్నపాటి మార్పులు, జాగ్రత్తలతో ప్రతి నెలా 15 నుండి 20 శాతం వరకు గ్యాస్‌ను ఆదా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. అటు డబ్బు ఆదా చేయడమే కాకుండా ఇటు భద్రతను కూడా పెంచే ఆ ఆచరణాత్మక చిట్కాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
బర్నర్ల నిర్వహణే కీలకం
చాలా ఇళ్లలో గ్యాస్ స్టవ్ కొన్న తర్వాత దాని నిర్వహణను మర్చిపోతుంటారు. బర్నర్లలో దుమ్ము, గ్రీజు పేరుకుపోవడం వల్ల గ్యాస్ ప్రవాహానికి ఆటంకం కలిగి మంట సరిగ్గా రాదు. దీనివల్ల గ్యాస్ ఎక్కువగా వృధా అవుతుంది. అందుకే బర్నర్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం వల్ల స్టవ్ పనితీరు మెరుగుపడుతుంది. పాత రెగ్యులేటర్లను మార్చడం, గ్యాస్ పైపులను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం వల్ల లీకేజీలను అరికట్టి ప్రమాదాలను నివారించవచ్చు.
వంట చేసే విధానంలో మార్పులు
వంట చేసేటప్పుడు మనం పాటించే కొన్ని అలవాట్లు గ్యాస్ వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తాయి.
- వంట పాత్రలపై మూత ఉంచడం వల్ల వేడి బయటకు పోకుండా ఆహారం త్వరగా ఉడుకుతుంది.
- స్టవ్ వెలిగించిన తర్వాత కూరగాయలు కోయడం లేదా పోపు సామాగ్రి కోసం వెతకడం వద్దు. వంటకు కావాల్సినవన్నీ ముందుగానే సిద్ధం చేసుకుంటే గ్యాస్ వృధా కాదు.
- బియ్యం, పప్పు వంటి పదార్థాలను వండడానికి అరగంట ముందు నానబెడితే అవి చాలా వేగంగా ఉడుకుతాయి.
ప్రెజర్ కుక్కర్: గ్యాస్ పొదుపునకు ఉత్తమ మార్గం
సాధారణ పాత్రల కంటే ప్రెజర్ కుక్కర్ వాడకం వల్ల ఇంధనం చాలా ఆదా అవుతుంది. కుక్కర్లో బియ్యం ఉడికించేటప్పుడే లోపల మరో చిన్న గిన్నెలో పప్పు లేదా కూరగాయలను ఉడికించడం వల్ల ఒకేసారి రెండు పనులు పూర్తవుతాయి. కూరగాయలను వీలైనంత చిన్న ముక్కలుగా కోయడం వల్ల అవి త్వరగా ఉడికి తక్కువ గ్యాస్ ఖర్చవుతుంది.
ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటించడం వల్ల ఏడాదికి కనీసం రెండు నుండి మూడు సిలిండర్ల వరకు ఆదా చేసే అవకాశం ఉందని గ్యాస్ మరమ్మతు నిపుణులు సూచిస్తున్నారు.