
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డ ఐటీ ఉద్యోగి అరెస్టు అయ్యాడు. మదనపల్లిలోని ఈశ్వరమ్మ కాలనీకి చెందిన రాజేష్ బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవాడు.
కోవిడ్ సమయంలో సాఫ్ట్వేర్ ఉద్యోగానికి స్వస్తి పలికి సొంతూరు మదనపల్లికి వచ్చాడు. ఐటీ ఉద్యోగిగా పనిచేసిన సమయంలో సంపాదించిన సొమ్ముతో జల్సాలు చేశాడు. ఆ తరువాత ఏ పని చేయకుండానే కాలం గడిపిన రాజేష్.. ఆ తర్వాత డబ్బు అవసరం చైన్ స్నాచర్‌గా మార్చింది. ఎవరికీ దొరక కుండా మహిళల మెడలో బంగారు గొలుసులను కాజేస్తూ వచ్చిన రాజేష్ చైన్ స్నాచర్‌గా ఆరితేరాడు. మదనపల్లి వన్ టౌన్ పీఎస్ పరిధిలోని దేవళంవీధిలో ఒక వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు దొంగలించిన రాజేష్ అడ్డంగా దొరికిపోయాడు. వృద్ధురాలు కేకలు వేయడంతో రాజేష్ స్థానికులకు చిక్కాడు. ఈ మేరకు స్థానికులు పోలీసులకు అప్పగించారు.
రాజేష్‌ను అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన రాజేష్ చైన్ స్నాచింగ్‌లో ఉన్న ప్రావీణ్యం ఏ పాటిదో అర్థం చేసుకొని అవాక్కయ్యారు. రాజేష్ పలు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు గుర్తించారు. దాదాపు రూ.40 లక్షల విలువ చేసే 250 గ్రాముల బంగారు ఆభరణాలు, 930 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు రాజేష్ సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి చైన్ స్నాచర్‌గా మారినట్లు గుర్తించిన పోలీసులు నేరాలపై ఆరా తీస్తున్నారు.
చైన్ స్నాచర్ రాజేష్‌ను అన్నమయ్య జిల్లా ఎస్పీ ముందు పోలీసులు హాజరుపరిచారు. రాజేష్ ఈజీ మనీ కోసం చైన్ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు తేల్చిన ఎస్పీ.. సులభంగా డబ్బు సంపాదన కోసమే ఇలాంటి నేరాలకు పాల్పడ్డాడన్నారు. యువత వ్యసనాలకులోనై పెడదారి పడుతున్నట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల కాస్తా జాగ్రత్తగా ఉండాలన్నారు.