
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ వ్యవస్థలో సంస్కరణలు తీసుకువచ్చేందుకు శ్రీకారం చుట్టింది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా సంస్కరణలు తీసుకువస్తోంది. ఇందులో భాగంగా జనాభా, ఆదాయం, భౌగోళిక ప్రాంతం ఆధారంగా పంచాయతీల పునర్విభజన చేయాలని నిర్ణయించింది. ఇదివరకు నియమించిన కమిటీ సిఫార్సుల ఆధారంగా పలు గ్రామ పంచాయతీలకు కేటగిరీలు విభజించింది. గ్రామ పంచాయతీలను పునర్వ్యవస్థీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ముఖ్యంగా అన్నమయ్య జిల్లా, అనంతపురం, అనకాపల్లి, అల్లూరి, తూర్పుగోదావరి, అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, బాపట్ల, చిత్తూరు జిల్లాల్లోని పలు పంచాయతీలను గ్రేడ్-1, గ్రేడ్-2, గ్రేడ్-3 కేటగిరీలుగా వర్గీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల్లోనూ పట్టణాల తరహా సదుపాయాల కల్పనకు కొత్తగా రూర్బన్ పంచాయతీల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 10 వేల జానాభా ఉంటే రూర్బన్ పంచాయతీలుగా విభజించింది. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆయా జిల్లాల్లో వర్గీకరించిన గ్రామ పంచాయతీల నిధులు సజావుగా వినియోగించేందుకు సీఎ్‌ఫఎంఎస్ పోర్టల్‌లో వివరాలు ఉంచాలని కోరింది. ఆన్లైన్ డేటాలో అవసరమైన మార్పులు చేయాలని ఏపీ ట్రెజరీ డైరెక్టర్‌ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..