ముందుగా ఆలయంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను మనోహరగుండం ఎదురుగా వేదికపై ఆశీనులను చేసి విశేష హారతులు సమర్పించారు. అక్కడి నుండి ఉత్సవమూర్తులకు కనుల పండువగా పల్లకీ సేవ నిర్వహించి, ఆలయం ఎదురుగా ఉన్న గంగాధర మండపం వద్దకు తీసుకువచ్చి, శాస్త్రోక్తంగా మన్మథ రూపాన్ని దహనం చేశారు. పరమేశ్వరుడి తపస్సును భంగం చేసేందుకు ప్రయత్నించిన మన్మథుడిని, ఈ ఫాల్గుణ శుద్ధ చతుర్దశి రోజే శివుడు తన మూడో కన్ను తెరిచి భస్మం చేశాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తూ అర్చకులు మన్మథుడి రూపాన్ని శాస్త్రోక్తంగా దహనం చేశారు. కామదహన కార్యక్రమాన్ని వీక్షించడం వల్ల మనసులోని కోరికలు చెడు కోరికలు నశించి, శంకరుడి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో శ్రీనివాసరావు దంపతులు, ఆలయ అర్చకులు, ఉన్నతాధికారులు మరియు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
మరిన్ని వీడియోల కోసం :