తెలుగు సినిమా చరిత్రలో శంకరాభరణం ఒక మైలురాయి, ఆ చిత్రంలో శంకరశాస్త్రి పాత్ర పోషించిన జే.వి. సోమయాజులు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. ఆయన పూర్తి పేరు జొన్నలగడ్డ వెంకట సుబ్రహ్మణ్య సోమయాజులు. 1928 జూన్ 30న శ్రీకాకుళం జిల్లాలోని లుకలాం గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి శివరామమూర్తి ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్. ఐదుగురు కుమారులు, ఒక కుమార్తెలో సోమయాజులు రెండవవారు. ఆయన సోదరులు రమణమూర్తి, శ్రీరామమూర్తి కూడా నటులే. సోమయాజులు కాలేజీ రోజుల్లోనే నటనకు శ్రీకారం చుట్టారు. శిథిలజీవి నాటకంలో తొలిసారి వితంతువు పాత్ర పోషించారు. తమ్ముడు రమణమూర్తితో కలిసి కవిరాజు మెమోరియల్ క్లబ్ పేరుతో ఎన్జీవో, దొంగాటకం, కాళరాత్రి వంటి అనేక నాటకాల్లో నటించారు. 1944లో, కేవలం 16 ఏళ్ల వయసులోనే రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో క్లార్క్‌గా చేరి, అంచెలంచెలుగా డిప్యూటీ కలెక్టర్‌గా ఎదిగారు. ఉద్యోగ బాధ్యతలతో పాటు నాటక రిహార్సల్స్‌కు సమయం దొరకనప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు రమణమూర్తి పక్కనే కూర్చొని స్క్రిప్ట్ చదివి వినిపించేవారు. వాటిని గుర్తుంచుకొని సోమయాజులు నాటకాల్లో నటించేవారు. అన్నదమ్ములిద్దరూ కలిసి గురజాడ అప్పారావు కన్యాశుల్కం నాటకాన్ని 42 ఏళ్ల పాటు కొన్ని వందలసార్లు ప్రదర్శించారు. ఆయన జాతకాన్ని మార్చిన చిత్రం శంకరాభరణం. అయితే, ఇది ఆయన తొలి చిత్రం కాదు. అంతకుముందు రారా కృష్ణయ్య చిత్రంలో నటించినా అది ఫ్లాప్ కావడంతో, శంకరాభరణంలో నటించడానికి మొదట ఒప్పుకోలేదు. తమ్ముడు రమణమూర్తి పట్టుబట్టడంతో ఆడిషన్స్‌కు వెళ్లారు.
కళాతపస్వి కె. విశ్వనాథ్ శంకరశాస్త్రి పాత్రకు ఎటువంటి ఇమేజ్ లేని కొత్త వ్యక్తిని వెతుకుతున్నప్పుడు, డిప్యూటీ కలెక్టర్ అయిన సోమయాజులను పిలిపించారు. ఆయన సూటూ బూటూ, హిప్పీ క్రాఫ్ చూసి సందేహించినా, మేకప్ టెస్ట్ తర్వాత సోమయాజులలోనే శంకరశాస్త్రిని దర్శకుడు విశ్వనాథ్ చూశారు. శంకరాభరణం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ పెద్ద విజయం సాధించింది. అంత కీర్తి ప్రతిష్టలు పొందిన తర్వాత, సోమయాజులు చుట్టూ భజనపరులు చేరారు. దర్శకుడు బాపు తెరకెక్కించిన త్యాగయ్య చిత్ర షూటింగ్ సమయంలో, ఆయన పాదాభివందనాలకు అలవాటు పడ్డారు. ఇది ఆయన శంకరశాస్త్రి పాత్ర ద్వారా ప్రజల్లో ఎంత ఎదిగిపోయారో తెలియజేస్తుంది. త్యాగయ్యతో పాటు వంశవృక్షం చిత్రంలోనూ బాపు దర్శకత్వంలో నటించారు. శంకరాభరణం తర్వాత విశ్వనాథ్ దర్శకత్వంలో సప్తపదిలో నటించినా, శంకరాభరణం స్థాయి విజయం దక్కలేదు. నెలవంక, సితార, స్వాతిముత్యం, దేవాలయం, ఆదిత్య 369 వంటి 150కి పైగా చిత్రాల్లో ఆయన నటించారు. రెండు కన్నడ, రెండు హిందీ, ఒక తమిళ చిత్రంలోనూ కనిపించారు.
వ్యక్తిగత జీవితంలో, డిప్యూటీ కలెక్టర్‌గా ఎదిగిన సోమయాజులు ఏనాడూ లంచం తీసుకోలేదు. శంకరాభరణం విజయం తర్వాత ఆయన ప్రభుత్వ ఉద్యోగం ఇబ్బందుల్లో పడింది. అనుమతి లేకుండా నటించి పారితోషికం తీసుకున్నారని ఫిర్యాదులు రావడంతో, అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి శంకరాభరణం చిత్రాన్ని చూసి, తెలుగునాట తొలిసారిగా కల్చరల్ అఫైర్స్ శాఖను సృష్టించి, సోమయాజులను దానికి డైరెక్టర్‌గా నియమించారు. అంతేకాకుండా, ప్రభుత్వ ఉద్యోగులు సినిమాల్లో నటించి పారితోషికం తీసుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేశారు. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వం ఉద్యోగుల పదవీవిరమణ వయస్సును తగ్గించినప్పుడు, సోమయాజులు ఉద్యోగం కోల్పోయారు. ఆ తర్వాత పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం రంగస్థల శాఖకు ఆయన్ను అధిపతిని చేసింది. టికెట్ కొని నాటకాలు చూసే అలవాటును ప్రోత్సహించడానికి రసరజని నాటక సంస్థను స్థాపించి, దాని అభివృద్ధికి కృషి చేశారు. 2004 ఏప్రిల్ 7న కన్నుమూసిన సోమయాజులు, చివరి క్షణం వరకు నటన పట్ల అంకితభావంతో జీవించారు.
Also Read: ఆయన తిని వదిలేసిన చికెన్ బోన్స్ తిన్న RGV.. అదేంటని అడిగితే..