ఇటీవల కాలంలో చాలా దేశాల్లో వెనుకకు నడవడం (రివర్స్ లేదా రెట్రో వాకింగ్) అనే వ్యాయామం వేగంగా ప్రాచుర్యం పొందుతోంది. యునైటెడ్ కింగ్డమ్లో ఫిట్నెస్ అభిమానులు, ఫిజియోథెరపిస్టులు, ఆరోగ్య పరిశోధకులు ఈ నడకనే ఫాలో అవుతున్నారు. మొదట్లో ఇది కొంచెం విచిత్రంగా అనిపించినా, శరీరం, మెదడుకు ఇది అనేక ప్రయోజనాలు అందిస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.
ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో ప్రచురితమైన ఒక పరిశోధన ప్రకారం, వెనుకకు నడవడం వల్ల కీళ్ల ఆరోగ్యం, కండరాల బలం, సమతుల్యత, గుండె ఆరోగ్యం, మెదడు పనితీరు మెరుగుపడుతాయి. సాధారణంగా ముందుకు నడిచే అలవాటు ఉన్న మనం, అడుగుల దిశను మార్చడం ద్వారా శరీరానికి కొత్త సవాలు ఇవ్వవచ్చు.
కీళ్ల ఆరోగ్యం, కండరాల బలం..
వెనుకకు నడవడం వల్ల మోకాలి చుట్టూ ఉన్న కండరాలు (క్వాడ్రిసెప్స్) మరింత బలపడతాయి. ముందుకు నడిచేటప్పుడు మడమ ముందుగా నేలను తాకడం వల్ల మోకాళ్లు, చీలమండలపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. కానీ, వెనుకకు నడిచేటప్పుడు పాదం ముందుభాగం నేలను తాకుతుంది. దీంతో మోకాళ్లపై ఒత్తిడి తగ్గి, కాళ్లు, తుంటి కండరాలు ఎక్కువగా పనిచేస్తాయి. అందుకే మోకాలి నొప్పి నుంచి కోలుకుంటున్నవారికి లేదా తక్కువ ఒత్తిడితో కండరాల బలం పెంచుకోవాలనుకునేవారికి ఇది మంచి వ్యాయామంగా పరిగణించబడుతోంది.
సమతుల్యత, శరీర సమన్వయం..
వెనుకకు నడవడం శరీర సమతుల్యత, సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది. ముందుకు నడవడం మనకు అలవాటు కాబట్టి ఎక్కువగా ఆలోచించకుండా చేస్తాం. కానీ వెనుకకు నడవడం సమయంలో శరీరం కొత్త కదలికకు అలవాటు పడాల్సి ఉంటుంది.
ఈ సమయంలో మెదడు ప్రోప్రియోసెప్షన్ (శరీర స్థానం, కదలికపై అవగాహన) పై ఎక్కువగా ఆధారపడుతుంది. దీంతో నాడీ వ్యవస్థ, కండరాల మధ్య సమన్వయం మెరుగుపడుతుంది. ప్రత్యేకంగా వృద్ధులకు ఇది ఎంతో ఉపయోగకరం. సురక్షితమైన ప్రదేశంలో లేదా ట్రెడ్‌మిల్‌పై వెనుకకు నడవడం సాధన చేస్తే పడిపోవడం వంటి ప్రమాదాలను తగ్గించుకోవచ్చు.
గుండె ఆరోగ్యం, కేలరీల దహనం..
పరిశోధనలు చెబుతున్నట్టు, అదే దూరం నడిచినా వెనుకకు నడిచేటప్పుడు హృదయ స్పందన రేటు ఎక్కువగా ఉంటుంది. అంటే తక్కువ వేగంతో నడిచినా శరీరం ఎక్కువ శ్రమ పడుతుంది. దీంతో కేలరీలు ఎక్కువగా దహనం అవుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాబట్టి పరుగెత్తలేని వారు లేదా తక్కువ ప్రభావం కలిగిన వ్యాయామం కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.
సాధారణ నడకలో కొన్ని నిమిషాలు వెనుకకు నడిచే విధంగా వ్యాయామాన్ని మార్చుకుంటే ఏరోబిక్ ఫిట్నెస్, కండరాల బలం రెండూ పెరుగుతాయి.
మెదడు పనితీరుకు కూడా మేలు..
వెనుకకు నడవడం శారీరక ఆరోగ్యంతో పాటు మెదడు పనితీరును కూడా ఉత్తేజపరుస్తుంది. ఈ కదలికకు మెదడు అలవాటు లేకపోవడం వల్ల, దిశ, సమతుల్యత, అడుగులపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. దీంతో జ్ఞాపకశక్తి, దృష్టి, నిర్ణయ సామర్థ్యం వంటి అభిజ్ఞా ప్రక్రియలు చురుకుగా పనిచేస్తాయి. కొత్త కదలికలను నేర్చుకోవడం మెదడులోని నాడీ సంబంధాలను బలపరుస్తుంది. దీర్ఘకాలంలో ఇది మెరుగైన ప్రతిస్పందన సమయం, మల్టీటాస్కింగ్ సామర్థ్యానికి సహాయపడుతుంది.
వెనుకకు నడవడం సాధారణంగా కనిపించినా, ఇది శరీరం, మెదడుకు కొత్త సవాళ్లు ఇచ్చే సమగ్ర వ్యాయామం. రోజువారీ నడకలో కొద్దిసేపు వెనుకకు నడవడం అలవాటు చేసుకుంటే కీళ్ల ఆరోగ్యం, గుండె ఆరోగ్యం, సమతుల్యత, మెదడు చురుకుదనం అన్నీ మెరుగుపడే అవకాశం ఉంది.






