కొమురం భీం జిల్లా సిర్పూర్ టి మండలం భీమన్న అటవీ శివారులో అనుమానాస్పదంగా చనిపోయిన ఇద్దరు పశువుల కాపరుల డెత్ మిస్టరీ వీడింది. రెండు రోజులుగా భీమన్న అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఎలుగుబంటే ఆ ఇద్దరిని పొట్టన పెట్టుకుందని అటవీ శాఖ అధికారులు తేల్చారు. తలపై బలమైన గోర్లతో దాడి చేసిన గాయాలు ఉండటం.. వీపుపై సైతం గోర్ల గుర్తులు ఉండటంతో ఎలుగుబంటి దాడిగా అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. ఎలుగుబంటి దాడిలో మృతి చెందిన భార్యాభర్తలిద్దరికి ఒక్కొక్కరికి పది లక్షల రూపాయల చొప్పున రూ. 20 లక్షల నష్టపరిహారాన్ని అటవీ శాఖ ప్రకటించింది.
కొమురంభీం జిల్లా ఆసిపాబాద్ టైగర్ రిజర్వ్ కాగజ్ నగర్ కారిడార్‌లోని సిర్పూర్ టి మండలం భీమన్న అచ్చలి గ్రామానికి చెందిన దూలం శేఖర్ (40), దూలం సుశీల (36) భార్యాభర్తలిద్దరూ పశువులను మేపేందుకు గురువారం (సెప్టెంబర్ 25) భీమన్న అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. పశువులు తిరిగి ఇంటికి చేరిన ఆ ఇద్దరు మాత్రం ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. దూలం శేఖర్ వద్ద ఉన్న సెల్‌ఫోన్‌కు ఫోన్ చేసినా సమాధానం రాకపోవడంతో పోలీసులు, అటవీ సిబ్బందికి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.
అటవీ సిబ్బంది పోలీసులతో కలిసి సమీప అటవీ ప్రాంతంలో గాలించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత రక్తపు గాయాలతో చెట్ల పొదల్లో పడి ఉన్న ఇద్దరిని పోలీసులు గుర్తించారు. అప్పటికే ఇద్దరు చనిపోవడంతో మృతదేహాలను సిర్పూర్ టీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఒంటిపై బలమైన గాయాలు ఉండటంతో పెద్దపులి దాడి చేసి ఉండవచ్చని అనుమానించారు అటవీ శాఖ సిబ్బంది. సమీపంలో ఎలాంటి పాదముద్రలు లేకపోవడంతో అనుమానాస్పద మృతిగా గుర్తించారు. ఉదయం మృతదేహాలు లభించిన అటవీ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించడంతో ఎలుగుబంటి ఆనవాళ్లు లభించాయి. దూలం సుశీల తలపై భాగంలో ఎలుగుబంటి గోటి గాయం కనిపించడంతో ఇద్దరిని పొట్టన పెట్టుకుంది ఎలుగుబంటే అని ప్రాథమికంగా తేల్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..