ప్రస్తుత పరిస్థితుల్లో కష్టపడి సంపాదించిన డబ్బును సురక్షితంగా పెంచుకోవడం చాలా ముఖ్యం. ద్రవ్యోల్బణం పెరుగుతున్న తరుణంలో స్టాక్ మార్కెట్ రిస్క్ లేకుండా, నమ్మకమైన రాబడిని ఆశించే వారి కోసం ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అద్భుతమైన పథకాన్ని అందిస్తోంది. అదే గ్రామ్ ప్రియ యోజన. గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద వచ్చే ఈ పథకం పెట్టుబడితో పాటు జీవిత బీమా రక్షణను కూడా కల్పిస్తోంది. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్‌లలో లాభాలతో పాటు నష్టభయం కూడా ఉంటుంది. కానీ గ్రామ్ ప్రియ యోజన పూర్తిగా ప్రభుత్వ పథకం కావడం వల్ల మూలధనం సురక్షితంగా ఉంటుంది. మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా స్థిరమైన రాబడి వస్తుంది.
పథకం వివరాలు – ప్రయోజనాలు
ఈ పథకం మొత్తం 10 సంవత్సరాల కాలపరిమితిని కలిగి ఉంటుంది. ఒక వ్యక్తి నెలకు రూ.5,042 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత పెట్టుబడిదారునికి మొత్తం రూ.7.25 లక్షల నిధి లభిస్తుంది.
బోనస్ వివరాలు
నిబంధనల ప్రకారం.. పోస్టాఫీసు ప్రతి రూ.1,000 బీమా మొత్తంపై సంవత్సరానికి రూ.45 బోనస్ ఇస్తుంది. మీరు రూ.5 లక్షల బీమా మొత్తాన్ని ఎంచుకుంటే, మీకు ప్రతి సంవత్సరం రూ.22,500 బోనస్ లభిస్తుంది. 10 సంవత్సరాలలో ఈ బోనస్ మొత్తం రూ.2,25,000 అవుతుంది.
జీవిత బీమా రక్షణ
ఈ పథకం కేవలం పొదుపు మాత్రమే కాదు జీవిత బీమా కూడా. పాలసీ వ్యవధిలో పాలసీదారుడు దురదృష్టవశాత్తూ మరణిస్తే మొత్తం నామినీకి చెల్లిస్తారు. అటువంటి పరిస్థితిలో కుటుంబం మిగిలిన ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు.
కీలక వివరాలు
- కనీస బీమా మొత్తం రూ.10,000, గరిష్టంగా రూ.5 లక్షలు.
- ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే మనీ-బ్యాక్ వాయిదాలను కూడా కాలానుగుణంగా ఇస్తారు.
- సకాలంలో ప్రీమియం చెల్లించడం చాలా అవసరం. ఆలస్యం అయితే పాలసీ ముగిసిపోయే ప్రమాదం ఉంది.