
ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం ఎంత ముఖ్యమో, నాణ్యమైన నిద్ర కూడా అంతే అవసరం. కానీ నేటి వేగవంతమైన జీవనశైలిలో పని ఒత్తిడి, స్మార్ట్‌ఫోన్ వ్యసనం వల్ల చాలామంది నిద్రలేమి సమస్యతో సతమతమవుతున్నారు. నిద్ర సరిగ్గా లేకపోతే పగటిపూట అలసట, కళ్ల కింద నల్లటి వలయాలు, ఏకాగ్రత లోపించడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రముఖ కథానాయిక ఒకరు ఒక అద్భుతమైన చిట్కాను పంచుకున్నారు. అదే ‘ఐ రోలింగ్ టెక్నిక్’. ఈ వినూత్న పద్ధతి ద్వారా నిమిషాల్లో ఎలా నిద్రలోకి జారుకోవచ్చో తెలుసుకుందాం..
ఎలా చేయాలి?
ఈ టెక్నిక్ చేయడం చాలా సులభం. దీనికోసం మీరు ప్రత్యేకంగా కష్టపడాల్సిన పనిలేదు.
- మొదట కళ్లు తెరిచి వాటిని నెమ్మదిగా ఎడమ వైపు తిప్పాలి, తర్వాత మధ్యలోకి తీసుకురావాలి.
- అదే విధంగా కుడి వైపు తిప్పి, మళ్ళీ మధ్యలోకి తీసుకురావాలి.
- ఆ తర్వాత కళ్లను పైకి చూసేలా చేసి, మళ్ళీ సాధారణ స్థితికి తేవాలి.
- ఇప్పుడు కళ్లను కిందకు అంటే ముక్కు చివరను చూసేలా ఉంచి, మళ్ళీ మధ్యలోకి తీసుకురావాలి.
- చివరగా కళ్లను ఒకసారి క్లాక్ వైజ్ (గడియారం ముల్లు తిరిగే దిశలో), మరోసారి యాంటీ క్లాక్ వైజ్ దిశలో గుండ్రంగా తిప్పాలి.
ఎలా పనిచేస్తుంది?
మనం సహజంగా గాఢ నిద్రలోకి వెళ్తున్నప్పుడు మన కళ్లు సాకెట్లలో తిరుగుతుంటాయి. ఈ టెక్నిక్ ద్వారా మనం కృత్రిమంగా ఆ స్థితిని సృష్టిస్తాం. కళ్లు మరియు ముక్కు కదలికపై దృష్టి పెట్టడం వల్ల మనసులోని అనవసర ఆలోచనలు, ఒత్తిడి పక్కకు తప్పుకుంటాయి. ఇది శరీరంలోని ‘పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ’ను సక్రియం చేస్తుంది. ఫలితంగా హృదయ స్పందన రేటు తగ్గి, మెదడులో విశ్రాంతినిచ్చే ‘ఆల్ఫా వేవ్స్’ ఉత్పత్తి అవుతాయి. ఇది మనల్ని త్వరగా నిద్రపోయేలా చేస్తుంది.
View this post on Instagram
ఈ టెక్నిక్ చేసేటప్పుడు గదిలో వెలుతురు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. పడుకోవడానికి 15 నిమిషాల ముందే ఫోన్‌ను ఫ్లైట్ మోడ్‌లో పెట్టి దూరంగా ఉంచాలి. కేవలం మీ కంటి కదలికలపైనే ధ్యాస పెట్టాలి. కేవలం ఈ టెక్నిక్ మాత్రమే కాకుండా, ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం అలవాటు చేసుకోవాలి. పడుకునే ముందు టీ, కాఫీ వంటి కెఫీన్ పానీయాలకు దూరంగా ఉండాలి.
ప్రశాంతమైన సంగీతం వినడం లేదా ధ్యానం చేయడం వల్ల కూడా మెరుగైన ఫలితాలు ఉంటాయి. నిద్ర అనేది విలాసం కాదు, అది శరీరానికి అవసరమైన మరమ్మత్తు సమయం. అదా శర్మ చెప్పిన ఈ సింపుల్ ఐ రోలింగ్ టెక్నిక్‌ను ప్రయత్నించి, మీరు కూడా హాయిగా నిద్రపోండి. ఆరోగ్యకరమైన నిద్రతో మీ రోజును ఉత్సాహంగా ప్రారంభించండి!