Money Laundering Case: ప్రముఖ ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్ ‘1xBet’తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో భారత మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్ (Yuvraj Singh), శిఖర్ ధావన్ (Shikhar Dhawan), సురేష్ రైనా (Suresh Raina) సహా పలువురు సెలబ్రిటీల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) త్వరలో జప్తు చేసే అవకాశం ఉంది. ఈ కేసు విచారణలో భాగంగా, అక్రమ ప్రకటనల ద్వారా వీరు పొందిన డబ్బుతో కొనుగోలు చేసిన ఆస్తులను జప్తు చేసేందుకు ఈడీ సిద్ధమవుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
కేసు నేపథ్యం: 1xBet స్కామ్..
‘1xBet’ ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్ వేల కోట్ల రూపాయల మేర ప్రజలను మోసం చేసిందని, భారీ మొత్తంలో పన్నులు ఎగవేసిందని ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈడీ విచారణ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో, క్రికెటర్లు, సినీ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సహా పలువురు ప్రముఖులను ప్రశ్నించింది.
దర్యాప్తులో క్రికెటర్లు..
గత కొద్ది వారాలుగా ఈడీ.. మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, శిఖర్ ధావన్, సురేష్ రైనా, రాబిన్ ఉతప్ప సహా నటులు సోనూ సూద్, మిమీ చక్రవర్తి వంటి వారిని ప్రశ్నించింది. అక్రమ ఆన్లైన్ బెట్టింగ్‌కు సంబంధించిన యాప్‌ను ప్రమోట్ చేయడానికి కంపెనీ వీరిని ఎలా సంప్రదించింది, వీరికి డబ్బులు ఏ రూపంలో (హవాలా లేదా బ్యాంక్ ఛానెల్ ద్వారా) అందాయి, వారు అందుకున్న మొత్తాన్ని దేనికి ఉపయోగించారనే విషయాలపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది.
ఇవి కూడా చదవండి
ఆస్తుల జప్తు ఎందుకు?
ఈడీ వర్గాల సమాచారం ప్రకారం, 1xBet కంపెనీ నుంచి ఎండార్స్మెంట్ ఫీజుగా అందుకున్న మొత్తాన్ని ఈ సెలబ్రిటీల్లో కొందరు ఆస్తుల కొనుగోలుకు ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. మనీలాండరింగ్ చట్టం ప్రకారం, అక్రమ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ‘ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్’ (Proceeds of Crime)గా పరిగణిస్తారు. ఈ నిధులతో కొనుగోలు చేసిన చర, స్థిర ఆస్తులను జప్తు చేయడానికి ఈడీ త్వరలో ప్రొవిజనల్ అటాచ్మెంట్ ఆర్డర్ (Provisional Attachment Order) జారీ చేసే అవకాశం ఉంది. ఈ ఆస్తుల్లో కొన్ని విదేశాల్లో, ముఖ్యంగా యూఏఈలో కూడా ఉన్నట్లు సమాచారం.
ముందుకు సాగుతున్న ప్రక్రియ..
ఆస్తుల విలువ, లెక్కింపు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈడీ ఆస్తులను జప్తు చేసిన తర్వాత, PMLA కింద ఏర్పాటు చేసిన అడ్జ్యుడికేటింగ్ అథారిటీకి పంపి, ధృవీకరణ పొందుతుంది. ఆ తర్వాత, ఈ ఆస్తులను జప్తు చేయాలని కోరుతూ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయనుంది.
ప్రభుత్వం ఇప్పటికే అక్రమ ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లపై ఉక్కుపాదం మోపుతోంది. ఈ కేసులో దేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడా ప్రముఖులపై ఈడీ చర్యలు తీసుకోవడం, ఆన్లైన్ బెట్టింగ్‌ల విషయంలో చట్టం పటిష్టంగా వ్యవహరిస్తుందనే సంకేతాన్నిస్తోంది.
గమనిక: చట్టపరమైన సంస్థ విచారణ చేయడం లేదా ప్రశ్నించడం అంటే నేరం రుజువైనట్లు కాదు. ఈ వార్త అధికారిక వర్గాల నుంచి అందిన సమాచారం ఆధారంగా రూపొందించాం. కేసు విచారణలో వివరాలు మారే అవకాశం ఉంది.