తెలంగాణ కుంభమేళా.. ప్రతీ రెండేళ్లకోసారి మేడారం మహా జాతర. వనదేవతలకు మొక్కు తీర్చుకోవడం కోసం యావత్ తెలంగాణ మేడారం వైపే దారితీస్తుంది. అంతటి ప్రాశస్త్యం ఉన్న జాతర ప్రాంగణానికి కొత్త రూపునివ్వడానికి కంకణం కట్టుకుంది తెలంగాణ సర్కార్. వందేళ్లపాటు చెక్కు చెదరకుండా నిలబడేలా అపురూప నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ చేతుల మీదుగా శ్రీకారం చుట్టబోతుంది. మేడారం సమ్మక్క సారక్కల క్షేత్రం రాబోయే రోజుల్లో ఎంత అద్భుతంగా ఉండబోతుంది. ఈ మేరకు మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది.
మేడారం సమ్మక్క సారక్క దేవతల గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ ఏర్పాట్లలో స్పీడ్ పెంచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆ వన దేవతలను దర్శించుకుని ఆధునీకరణ పనులను పరిశీలించారు. సమ్మక్క సారక్క దేవతలకు ప్రీతికరమైన నిలువెత్తు బంగారాన్ని (బెల్లం) తులాభారం ద్వారా సమర్పించారు. ముఖ్యమంత్రి ఎన్ని కిలోలు తూగారో తెలుసా..!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 68 కిలోలు తూగారు. మేడారం మాస్టర్ ప్లాన్ పరిశీలనలో భాగంగా ప్రత్యేక హెలికాప్టర్ లో మేడారంకు చేరుకున్న ముఖ్యమంత్రికి స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి సీతక్క, మేడారం పూజారులు, ఆదివాసీలు స్వాగతం పలికారు. ఆదివాసీ ఆచార సంప్రదాయాలు, డోలి వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. ప్రధానద్వారం లోపలికి వచ్చిన ముఖ్యమంత్రి తులాభారం సమర్పించారు.. సమ్మక్క సారక్క దేవతలకు ప్రీతికరమైన నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించారు. అయితే CM తులాభారంలో 68 కిలోలు తూగారు. ఆయన ఎత్తు బెల్లాన్ని అమ్మవార్లకు సమర్పించారు.
2024 మహా జాతర సమయంలో సమ్మక్క-సారక్క దేవతల దర్శనానికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించారు.. అప్పుడు కూడా ఆయన 68 కిలోలే తూగారు. రెండేళ్లు కావస్తున్న ముఖ్యమంత్రి బరువు ఏమాత్రం తగ్గడం, పెరగడం కాని జరగకపోవడం విశేషం.
ఇదిలావుంటే, ప్రతీ జాతరకు పదీపదిహేను శాతం భక్తులు పెరుగుతున్నారు. రోజుకు సగటున 40 లక్షల మంది వచ్చే మహాజాతర ఇది. అందుకే భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు, భక్తుల మనోభావాలు, ఆదివాసీల విశ్వాసాలు ఏమాత్రం దెబ్బతినకుండా తుది నమూనా సిద్ధం కాబోతోంది.
ప్రకృతిని ఆరాధించే ఆదివాసీలు విగ్రహారాధనకు, వాస్తుశాస్త్రం, ఆగమశాస్త్ర నియమాలకు పూర్తిగా విరుద్ధం. ఇటువంటి పరిస్థితుల్లో మేడారం మహాక్షేత్రం పునర్నిర్మాణం సవాళ్లతో కూడుకున్నది. అందుకే, ముఖ్యమంత్రి నియమించిన ప్రత్యేక ఆర్కిటెక్ సిబ్బంది మేడారం పూజారులు, ఆదివాసీల సూచనల మేరకు ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..