
అనకాపల్లి జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. నర్సీపట్నం నియోజకవర్గంలోని పెద్ద బొడ్డేపల్లి గ్రామానికి చెందిన మహిళ, ఆమె చిన్నారి కుమారుడు మృతదేహాలు చెరువులో కనిపించడం తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన వడిసల భాగ్యలక్ష్మి (35), ఆమె కుమారుడు సాయి ఇషాన్ (3) మృతదేహాలు కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరాపల్లి సమీపంలోని తమ్మయ్య చెరువులో తేలియాడుతూ కనిపించాయి. ఆ దృశ్యాలను చూసిన స్థానికులు షాక్‌కు గురయ్యారు. సోమవారం జరిగిన ఈ విషాద ఘటన వెనుక ఉన్న పరిస్థితులు కుటుంబ సభ్యులను, గ్రామస్థులను కంటతడి పెట్టిస్తున్నాయి.
బంధువులు తెలిపిన వివరాల ప్రకారం, తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరానికి చెందిన భాగ్యలక్ష్మికి నాలుగేళ్ల క్రితం అనకాపల్లి జిల్లా పెద్దబొడ్డేపల్లికి చెందిన దుర్గాప్రసాద్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. కోటి ఆశలతో కాపురం ప్రారంభించిన భాగ్యలక్ష్మికి కొద్ది రోజుల్లోనే జీవితంలో సమస్యలు మొదలయ్యాయని బంధువులు చెబుతున్నారు. వివాహం తర్వాత కొంతకాలం వరకు అన్నీ బాగానే ఉన్నప్పటికీ, ఆ తర్వాత కుటుంబంలో తరచూ గొడవలు జరిగేవని తెలుస్తోంది. అత్త లేకపోయినా, మామ, ఇద్దరు ఆడపడుచులు, భర్త నుంచి ఆమెకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని బంధువులు ఆరోపిస్తున్నారు. పెళ్లైన నాలుగేళ్ల కాలంలో భర్తతో కలిసి భాగ్యలక్ష్మి కేవలం ఐదారు నెలలు మాత్రమే సంతోషంగా గడిపిందని చెబుతున్నారు.
ఇంట్లో ఎదురయ్యే సమస్యల గురించి ఆమె పలుమార్లు భర్తకు చెప్పినా సరైన స్పందన రాలేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. దీంతో మెట్టినిల్లు అంటేనే భాగ్యలక్ష్మికి భయంగా మారిందని వారు అంటున్నారు. ఎన్నిసార్లు పెద్దలు మధ్యవర్తిత్వం చేసి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించినప్పటికీ కాపురం సవ్యంగా కొనసాగలేదని తెలుస్తోంది. ఇక చివరకు జీవితం మీద ఆశలు కోల్పోయిన భాగ్యలక్ష్మి కఠిన నిర్ణయం తీసుకున్నట్టు అనుమానిస్తున్నారు. సోమవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె తన మూడు సంవత్సరాల కుమారుడు సాయి ఇషాన్‌తో కలిసి చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.
తమ్మయ్య చెరువులో మృతదేహాలు తేలడంతో స్థానికులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయి విచారణ ప్రారంభించారు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..