
ఏడాదిన్నర క్రితం దస్లీ అనారోగ్యంతో మరణించడంతో నాను నాయక్ ఒంటరివాడయ్యాడు. భార్య భౌతికంగా దూరమైనా, ఆమె జ్ఞాపకాలు తన వెంటే ఉండాలని రూ. 3 లక్షల ఖర్చుతో తన వ్యవసాయ భూమిలో దస్లీ విగ్రహాన్ని ప్రతిష్టించాడు. అయితే, ఇక్కడే నాను నాయక్ ఒక వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. తన మరణం తర్వాత తన విగ్రహాన్ని తన కుమారులు పెడతారో పెట్టరో అన్న సందేహంతో పాటు, మరణానంతరం కూడా తన భార్య పక్కనే తాను ఉండాలనే ఆకాంక్షతో బ్రతికుండగానే తన విగ్రహాన్ని కూడా తయారు చేయించి ఆమె పక్కనే నిలిపాడు. ప్రస్తుతం తన విగ్రహానికి ముసుగు వేసి ఉంచిన ఆయన.. తాను మరణించాక ఈ ముసుగు తొలగించి, తామిద్దరినీ కలిపి చూడండి అని తండావాసులను కోరుతున్నాడు.తన కొడుకులకు భారం కావద్దని తన పెన్షన్ డబ్బులతోనే ఈ విగ్రహాలు చేయించానని నాను చెబుతున్నాడు. చిన్న చిన్న కారణాలకే విడిపోయే ఈ తరం యువత.. తమను చూసి ప్రేమ విలువ తెలుసుకోవాలంటున్నాడు. ప్రతిరోజూ తన భార్య విగ్రహం వద్దకు వెళ్లి, కన్నీరు మున్నీరుగా రోదిస్తూ ఆమెతో మాట్లాడుకుంటున్న నాను నాయక్ దృశ్యం తండావాసులను కదిలిస్తోంది. ఆరుగురు సంతానం ఉన్నప్పటికీ, ఎవరికీ ఇబ్బంది కలగకూడదని ఆత్మగౌరవంతో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం నేటి సమాజానికి ఒక పాఠం. భార్యాభర్తల బంధం అంటే కేవలం నూరేళ్ల పంట మాత్రమే కాదు.. అంతకు మించిన అనంతమైన ప్రయాణమని నాను నాయక్ నిరూపిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :