కేరళ కొచ్చిలో కస్టమ్స్ అధికారులు మలయాళ నటులు దుల్కర్ సల్మాన్ , పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంట్లో సోదాలు చేయడం తీవ్ర కలకలం రేపింది. భూటాన్ నుంచి 100 లగ్జరీ కార్లను దిగుమతి చేసుకున్న కేసులో కస్టమ్స్ అధికారులు సోదాలు చేస్తున్నారు. 30 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. భూటాన్‌లో తక్కువ ధరకే కార్లను కొని భారత్‌లో ఎక్కువ ధరకు ఈ కార్లను అమ్ముతున్నట్టు గుర్తించారు.
ఆపరేషన్ నమ్‌కార్ పేరుతో కస్టమ్స్ అధికారులు కేరళ లోని పలు నగరాల్లో సోదాలు చేస్తున్నారు. కొచ్చి , తిరువనంతపురం , మల్లాపురం , కుట్టాపురంలో సోదాలు జరుగుతున్నాయి. సరైన పత్రాలు చూపించకుంటే భూటాన్ నుంచి దిగుమతి చేసుకున్న కార్లను స్వాధీనం చేసుకుంటామని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.
ఇందులోభాగంగా కోచి, తిరువనంతపురంలో ఉన్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఇళ్లతో పాటు, పనంపిల్లి నగర్‌లోని సల్మాన్ దుల్కర్ నివాసానికి వెళ్లి అధికారులు సోదాలు చేశారు. అయితే, వారివద్ద ఎలాంటి వాహనాలను గుర్తించారనేది తెలియాల్సి ఉంది.
ఇంటెలిజెన్స్ వర్గాల ప్రకారం.. భూటాన్ నుంచి ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా ఇండియాకు లగ్జరీ కార్లు స్మగ్లింగ్ చేశారన్న సమాచారంతో తనిఖీలు చేపట్టారు.