పలువురు సినీ, క్రికెట్ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు చెందిన కోట్ల రూపాయల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ED సన్నాహాలు చేస్తోంది. ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ ప్లాట్‌ఫామ్ వన్ ఎక్స్‌బెట్ ప్రమోషన్లకు సంబంధించిన కేసులో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ చర్యలు తీసుకోబోతోంది. బెట్టింగ్, గేమింగ్ యాప్‌ల నుంచి వచ్చిన డబ్బును చాలామంది సెలబ్రిటీలు ఉపయోగిస్తున్నట్లుగా ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని ఈడీ అధికారులు పేర్కొన్నారు. అటాచ్ చేయబడే ఆస్తుల్లో భారత్‌తో పాటు విదేశాల్లోనూ అనేక ఆస్తులను గుర్తించినట్లు సమాచారం. ఎండార్స్‌మెంట్ ఫీజులను ‘క్రిమినల్ ఇన్‌కమ్’గా ఈడీ పరిగణిస్తోంది. ఆన్‌లైన్ బెట్టింగ్ కంపెనీల నుంచి వచ్చిన ఎండార్స్‌మెంట్ ఫీజులను ఉపయోగించి అనేక మంది సెలబ్రిటీలు ఆస్తులను కొనుగోలు చేశారని ED దర్యాప్తులో తేలింది.
ఈడీ నిఘాలో ఉన్న ఆస్తుల్లో భారత్‌తో పాటు విదేశాల్లో ముఖ్యంగా యూఏఈలో స్థిరచరాస్తులు ఉన్నాయి. సెంట్రల్ ఏజెన్సీ ప్రస్తుతం ఆయా ఆస్తులను పరిశీలిస్తుండగా.. త్వరలోనే తాత్కాలిక అటాచ్‌మెంట్ కోసం ఉత్తర్వులు జారీ చేయనున్నారని తెలుస్తోంది. దీనికి అవసరమైన ఆమోదం కోసం PMLA అథారిటీకి ఆర్డర్‌ను పంపనున్నారు. ఆమోదం లభిస్తే ప్రత్యేక కోర్టులో ఈడీ చార్జిషీట్ దాఖలు చేయనున్నది. కోర్టు అనుమతిస్తే, ఆయా ఆస్తులను శాశ్వతంగా జప్తు చేయనున్నారు. బెట్టింగ్, గేమింగ్ యాప్స్ ప్రమోషన్‌కు సంబంధించి…కొద్దిరోజులుగా ఈడీ పలువురు ప్రముఖ క్రికెటర్లతో పాటు సినీ నటులను ప్రశ్నించింది.
ఈడీ జాబితాలో మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, సురేష్ రైనా, రాబిన్ ఊతప్ప, శిఖర్ ధావన్, నటుడు సోను సూద్, తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మిమి చక్రవర్తి, బెంగాలీ నటుడు అంకుష్ హజ్రా ఉన్నారు. ఇక పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు సైతం ఈడీ రాడార్‌లో ఉన్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో PMLA సెక్షన్ 50 కింద వారిని కూడా ఈడీ ప్రశ్నించింది. వాళ్ల బ్యాంకు ఖాతాలు, లావాదేవీలకు సంబంధించిన పత్రాలను కూడా ఈడీ పరిశీలిస్తోంది.
ఆన్‌లైన్ బెట్టింగ్ కంపెనీని ఎలా సంప్రదించారు? ఏ ఛానెల్ ద్వారా…అంటే హవాలా లేదా బ్యాంకింగ్ మార్గాల ద్వారా నగదు చెల్లింపు జరిగిందా? చెల్లింపులు దేశంలో జరిగాయా? లేదా విదేశాల్లో అందుకున్నారా? ఆర్థిక లావాదేవీల సమయంలో భారత్‌లో ఆన్‌లైన్ బెట్టింగ్ చట్టవిరుద్ధమని తెలుసా? అని ఈడీ ఆయా సెలబ్రిటీలను ప్రశ్నించినట్లు సమాచారం. ఇక బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా కూడా…. OneXBet బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఈ కేసులో ఈడీ ఆమెకు సమన్లు జారీ చేసింది. విదేశీ పర్యటనలో ఉన్నందున ఈడీ విచారణకు ఆమె హాజరు కాలేదు.
OneXbet అనేది కురాకో అనే ద్వీప దేశంలో నమోదైన కంపెనీ. దాని వెబ్‌సైట్, మొబైల్ యాప్ దాదాపు 70 భాషల్లో అందుబాటులో ఉన్నాయి. వేల కోట్ల రూపాయల విలువైన బెట్టింగ్ జరిగే ఈ ప్లాట్‌ఫారమ్‌పై ఇప్పటి వరకు ఈడీ నేరుగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ, ఇటీవల భారత ప్రభుత్వం ఆన్‌లైన్ గేమింగ్‌ను నిషేధిస్తూ ఒక చట్టాన్ని చేసింది. ఓ అంచనా ప్రకారం.. నిషేధానికి ముందు దేశంలో దాదాపు 22 కోట్ల మంది, వివిధ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు కనెక్ట్ అయ్యారు. ఇందులో సగం క్రమం తప్పకుండా యాక్టివ్‌గా ఉండేవారని సమాచారం. ED తాజా నిర్ణయం, సెలబ్రిటీలకు వెన్నులో వణుకు పుట్టిస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..