ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు గ్రామ రైతులు ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా పక్షులను అదిలించడానికి మనుషులు కావాలి, కానీ ఇక్కడ గాలి ఉంటే చాలు.. ఆ గంటలే కాపలా కాస్తాయి. అదెలా అంటే… ఖాలీ బీరుసీసాలతో పొలాల్లో గంటల్లా వేలాడదీస్తారు. బీరుసీసా మూతికి ఒక పెద్ద ఇనుప మేకును జతచేసి దానిని పొలం చుట్టూ గట్లపై ఉన్న చెట్లకు వేళాడగడతారు. ఈ మేకుకు తేలికపాటి అట్టముక్కను కడతారు. గాలికి ఈ అట్టముక్క అటూ ఇటూ ఊగుతూ ఉంటుంది. అదేసమయంలో బీరుసీసాకు కట్టిన మేకు కదిలి సీసాకు తగలడంతో శబ్ధం వస్తుంది. ఈ శబ్ధానికి పొలాల్లో పంటను తినేస్తున్న చిలుకలు ఇతర పక్షులు పారిపోతున్నాయి.
ఒకవైపు కోతుల బెడద, మరోవైపు పశువుల సంచారంతో ఇబ్బంది పడుతున్న రైతులకు ఈ చిలుకల బెడద పెద్ద సమస్యగా మారింది. ఖరీదైన నెట్స్, పురుగుమందుల కంటే, కేవలం పాత సీసాలు, బోల్టులతో తయారుచేసిన ఈ ‘డెసిబెల్’ పరికరం అద్భుతంగా పనిచేస్తోందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కందుకూరు, మర్లపాడు పరిసరాల్లో సుమారు 20కి పైగా ఇలాంటి గంటలు ఇప్పుడు పంటలకు కాపలాగా నిలుస్తున్నాయి. రైతుల ఈ ‘దేశీ జుగాడ్’ చూసి నెటిజన్లు ఐడియా అదిరింది అంటూ ప్రశంసిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :