
జీవిత భాగస్వామి చనిపోతే విగ్రహం ఏర్పాటు చేయడం అక్కడక్కడ చూసి ఉంటాం. కానీ భార్య మరణాన్ని తట్టుకోలేక విగ్రహం ఏర్పాటు చేసిన ఓ భర్త. బతుకైనా చావైనా తన పక్కనే నేను ఉండాలంటూ బతికి ఉండగానే తన విగ్రహం కూడా పెట్టుకుని తన భార్యపై తనకున్న ప్రేమను నేటి సమాజానికి చూపాడు ఓ కురవృద్ధుడు.
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చిప్పరాళ్లబండ తండకు చెందిన 90 సంవత్సరాల వృద్ధుడు భూక్య నాను నాయక్ అనే ఆయనకు దస్లితో వివాహమై 70 ఏళ్ల అయ్యింది. దస్లీ ఏడాదిన్నర కింద తీవ్ర అనారోగ్యంతో మృతి చెందింది. భార్య భౌతికంగా లేకపోయినా తన జ్ఞాపకమై నిలువాలని తన వ్యవసాయ భూమిలో 3 లక్షల రూపాయలతో దస్లీ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. నాను నాయక్ ఏనాటికైనా ఆమె దరి చేరుతానని, బతుకులోను మరణంలోను.. చివరికి విగ్రహాల్లోనూ ఆమెకు తోడుగా ఉండాలని భావించాడు. బతికుండగానే తన విగ్రహాన్ని తయారు చేయించి తన భార్య దస్లి విగ్రహం పక్కనే ఏర్పాటు చేసి తన విగ్రహానికి ముసుగేసి ఉంచాడు. తన మరణానంతరం విగ్రహాన్ని ఆవిష్కరించాలని తండావాసులను కోరుతున్నాడు. రోజు తన భార్య దస్లీ విగ్రహం దగ్గరికి వెళ్లి అక్కడే కొద్దిసేపు కూర్చొని తనను తలుచుకుంటూ కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నాడు.
నాను నాయక్ కు ఆరుగురు సంతానం. అందులో 5 కొడుకులు ఒక్క కూతురు ఉంది. అందరికి పెళ్లిళ్లు అయ్యాయి. కొడుకులకు భారం కావద్దని నెలకు వచ్చే పెన్షన్ డబ్బుల్లో నుంచి కొంత తన భార్య విగ్రహం ఏర్పాటు చేశాడు. అయితే ఇరుగుపొరుగు వారి సూచనల మేరకు తన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నట్లు నాను నాయక్ తెలిపారు. .తన మరణం అనంతరం ఏ కొడుకు ఇబ్బంది పడొద్దు అని తనకు తానే ఆలోచన చేసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. తన మరణం తర్వాత తన విగ్రహానికి కట్టిన గుడ్డను తొలగిస్తే తనకు ఆత్మశాంతి కలుగుతుందని తండవాసులకు, తన బంధువులకు తెలియజేస్తున్నాడు. తమను ఆదర్శం తీసుకుని ఈతరం యువకులూ ఆవేశాలకు వెళ్లి, చిన్నచిన్న కారణాలకు గొడవలు పడి విడిపోవద్దని విజ్ఞప్తి చేశాడు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..