చెవులు, దవడల మీదుగా నిలువుగా ముఖం చుట్టూ కంప్రెషన్ బ్యాండ్‌ను అమర్చుకుని కొన్ని గంటల తర్వాత తొలగిస్తే చాలు. ముఖం బక్కచిక్కి మిమ్మల్ని చక్కనమ్మల్ని చేస్తుంది. నాజూకు నగుమోము మీ సొంతమవుతుంది అంటూ ఊదరగొడుతున్నాయి కంపెనీలు. అయితే, ముఖంలో షేప్ తీసుకురావటానికి ధరించే ఈ ఎలాస్టిక్ పట్టీలు నిజంగానే ముఖాన్ని నాజూకుగా మార్చేస్తాయా అంటే.. పూర్తిగా కాదు అంటున్నారు కాస్మెటాలజిస్టులు. ముఖాన్ని కంప్రెషన్ బ్యాండ్ పట్టి ఉంచుతుంది. అంటే ముఖాన్ని బిగించేస్తుంది. ఈ ఒత్తిడి కారణంగా ముఖం ఉబ్బడం తగ్గుతుంది. చర్మంలో ఉబ్బుకు కారణమయ్యే కణజాల ద్రవాన్ని తిరిగి ప్రసరణలోకి పంపే లింఫటిక్ వ్యవస్థ క్రియాశీలం అవుతుంది. దాంతో ముఖ చర్మం బిగుతుగా మారి ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఫేస్ మసాజ్‌లో జరిగేది కూడా ఇదే. సోషల్ మీడియాలో ఈ ఫేస్ బ్యాండ్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. దవడల్ని పదునెక్కించి, ముఖ చర్మంలోని వదులును తగ్గించుకునేందుకు మహిళలు ఈ కంప్రెషన్ బ్యాండ్‌ల పట్ల ఆసక్తి చూపుతున్నారు. కాస్మెటిక్స్ వాడటం ఇష్టం లేనివారికి ఇదొక వరంలా కనిపిస్తోంది. పైగా వీటిని ఇంట్లోనే అమర్చుకోవచ్చు. ఎవరికీ కనిపించకూడదు అనుకుంటే.. రాత్రుళ్లు పెట్టుకుని పడుకోవచ్చు. తీసిన కొన్ని గంటల వరకు ముఖం పలుచగా, తేటగా కనిపిస్తుంది. నిపుణులు చెబుతున్న దాన్ని బట్టి కంప్రెషన్ బ్యాండ్‌లు పైకి హాని చేయనివిగా కనిపించవచ్చు కానీ, వాటిని సరిగ్గా ఉపయోగించకపోతే మాత్రం సురక్షితం కావు. బ్యాండ్ పట్టి ఉంచే ఒత్తిడికి ముఖంలో అసౌకర్యంగా ఉంటుంది. తలనొప్పి రావచ్చు. రక్త ప్రసరణ పరిమితం కావచ్చు. బ్యాండ్ లోపలి వైపు చర్మానికి చెమట పట్టి దద్దుర్లు రావచ్చు. పైగా ఎక్కువసేపు ధరించటం వల్ల ముఖంపై నొక్కులు పడతాయి. తిమ్మిరి కూడా ఉండొచ్చు అంటున్నారు చర్మవైద్య నిపుణులు. ఫేషియల్ బ్యాండ్‌ల కంటే ముఖ వ్యాయామాలు ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో..పొట్ట నిండా చెంచాలు..టూత్ బ్రష్‌లే..