కీసర, సెప్టెంబర్ 24: తమ ఇష్టానికి వ్యతిరేకంగా కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని.. ఆమె తల్లిదండ్రులు పగబట్టారు. అంతేనా.. కూతురి అత్తింటి వారిపై మూకుమ్మడిగా దాడి చేశారు. అడ్డొచ్చిన కూతురిని బయటకు ఈడ్డుకుంటూ తీసుకొచ్చి.. ఆమె చేతులు, కాళ్లకు తాడు కట్టి కారులో పడేసి ఎత్తుకెళ్లిపోయారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ కిడ్నాప్‌కు సంబంధించిన సీసీటీవీ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ అమానుష ఘటన బుధవారం (సెప్టెంబర్ 24) నగర శివారులోని కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. అసలేం జరిగిందంటే..
మేడ్చల్ జిల్లా కీసర నగర శివారులోని దమ్మాయిగూడ మున్సిపాల్టీ పరిధిలోని నర్సంపల్లి గ్రామానికి చెందిన చిత్తారి, పద్మల కుమారుడు ప్రవీణ్. అదే గ్రామానికి చెందిన బాల్‌నర్సింహ, మహేశ్వరిల కుమార్తె శ్వేత ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి వివాహానికి శ్వేత కుటుంబం ఒప్పుకోలేదు. దీంతో గత జూలై 11న ప్రవీణ్, శ్వేతా ఇంటి నుంచి వెళ్లిపోయి సికింద్రాబాద్‌లోని ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత హైదరాబాద్‌లోనే కాపురం ఉంటున్నారు. ఇద్దరి కన్నోళ్లు ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో పెద్దలు మనసు మార్చుకుంటరాని శ్వేత, ప్రవీణ్ భావించారు. ఇంతలో ప్రవీణ్ తండ్రి ఆరోగ్యం బాగా లేకపోవడంతో సొంత ఊరు నర్సంపల్లికి వచ్చారు.
ఇవి కూడా చదవండి
ఈ విషయం తెలుసుకున్న శ్వేత తల్లిదండ్రులు బాల్ నర్సింహ, మహేశ్వరి, బంధువులు కారులో వచ్చి ప్రవీణ్ ఇంటిపై దాడి చేశారు. శ్వేతను ఇంటి నుంచి బయటకు ఈడ్చుకెళ్లి కాళ్లు, చేతులకు తాడు కట్టి కారులో పడేసి ఎత్తుకెళ్లారు. అడ్డొచ్చిన ప్రవీణ్ తల్లిదండ్రుల కళ్లలో కారం చల్లి కర్రలతో వారిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. చుట్ట పక్కల ఇరుగుపొరుగు చోద్యం చూస్తున్నారేతప్ప ఎవరూ అడ్డుకోలేదు. దీంతో ప్రవీణ్ కుటుంబ సభ్యులు ఇంట్లో నుంచి గొడ్డలి తెచ్చి కారుపై దాడి చేసేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. తమపై జరిగిన దౌర్జన్యం గురించి శ్వేత భర్త కీసర పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన భార్య శ్వేతను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన భార్యను తనకు అప్పగించాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. శ్వేత కాళ్లు కట్టేసి కారులో పడేస్తున్న సీసీ కెమెరా దృశ్యాలు వైరల్‌గా మారాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.