హోలీ సందర్భంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నేతృత్వంలోని ప్రభుత్వం కరవు భత్యం (DA)ను 3 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపుతో రాష్ట్రంలోని సుమారు 7 లక్షలకుపైగా ఉద్యోగులు, లక్షలాది మంది పెన్షనర్లు నేరుగా లాభపడనున్నారు. తాజా నిర్ణయంతో డీఏ రేటు 55 శాతం నుంచి 58 శాతానికి పెరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకారం ఇప్పుడు మధ్యప్రదేశ్ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డీఏ పొందుతారు. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా ఈ డిమాండ్‌ను ముందుకు తెచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపింది. పెరిగిన డీఏ ఏప్రిల్ 2026 నుంచి అమల్లోకి వస్తుంది. దీని ప్రభావం మే 2026లో అందుకునే జీతాలు, పెన్షన్లలో కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం జూలై 2025 నుంచి పెంపును వర్తింపజేయాలని నిర్ణయించడంతో ఉద్యోగులు బకాయిలను కూడా పొందనున్నారు. బకాయిల చెల్లింపును ఒకేసారి కాకుండా ఆరు సమాన వాయిదాల్లో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చెల్లింపులు మే 2026 నుంచి ప్రారంభమవుతాయి. దీంతో ఉద్యోగులు పెరిగిన జీతంతో పాటు అదనపు మొత్తాన్ని నెలనెలా పొందే అవకాశం ఉంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ఈ నిర్ణయం ఉద్యోగులకు కొంత ఆర్థిక ఉపశమనాన్ని కలిగించనుంది.
ఒక ఉద్యోగి ప్రాథమిక జీతం రూ.50,000 అయితే, ఇప్పటివరకు 55 శాతం ప్రకారం రూ.27,500 డీఏ అందుకునేవారు. ఇప్పుడు 58 శాతం ప్రకారం రూ. 29,000 డీఏ లభిస్తుంది. అంటే నెలకు రూ. 1,500 అదనంగా వస్తుంది. అదే విధంగా ప్రాథమిక పెన్షన్ రూ. 30,000 ఉన్న పెన్షనర్‌కు డీఆర్ రూ. 16,500 నుంచి రూ. 17,400కు పెరిగి నెలకు రూ. 900 అదనంగా అందుతుంది. ఏడాదికి ఇది గణనీయమైన మొత్తం అవుతుంది. హోలీ పండుగ సందర్భంగా వచ్చిన ఈ ప్రకటనతో ఉద్యోగులు, పెన్షనర్లలో ఆనందం రెట్టింపైంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి