
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ తన ఇంధన అవసరాల కోసం అత్యంత పటిష్టమైన బఫర్ స్టాక్‌ను సిద్ధం చేసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న భూగర్భ వ్యూహాత్మక కేవర్లు, పైప్‌లైన్లు, సముద్ర మార్గంలో ఉన్న నౌకల్లో సుమారు 25 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు నిల్వలు ఉన్నాయి. ఈ భారీ నిల్వలు అంతర్జాతీయంగా సరఫరా నిలిచిపోయినా, మన దేశీయ అవసరాలను ఏకంగా 7 నుండి 8 వారాల వరకు తీర్చగలవు. ముఖ్యంగా విశాఖపట్నం, మంగళూరు, పడూరు వంటి కేంద్రాల్లో భూగర్భ నిల్వలు అత్యవసర సమయాల్లో మనకు శ్రీరామరక్షగా నిలవనున్నాయి. గతంలో భారతదేశం తన ఇంధన అవసరాల కోసం కేవలం గల్ఫ్ దేశాలపైనే ఆధారపడేది. కానీ గత దశాబ్ద కాలంలో భారత్ తన చమురు సరఫరా దేశాల సంఖ్యను 27 నుండి 40కి పెంచి డైవర్సిఫికేషన్‌లో రికార్డు సృష్టించింది. ఒకప్పుడు హార్ముజ్ జలసంధి వంటి ఒకే మార్గంపై 100శాతం ఆధారపడగా.. ఇప్పుడు దానిని 40 శాతానికి తగ్గించి, మిగిలిన 60 శాతాన్ని ఇతర సురక్షిత మార్గాల ద్వారా పొందుతోంది. అంతర్జాతీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, రష్యా నుండి చమురు కొనుగోళ్లను కొనసాగిస్తూ భారత్ తన జాతీయ ప్రయోజనాలే ముఖ్యమని ప్రపంచానికి చాటిచెప్పింది. ప్రస్తుతం రష్యానే భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా నిలుస్తోంది.
రిఫైనింగ్ సామర్థ్యం – ప్రపంచానికి ఎగుమతిదారు
ముడి చమురు దిగుమతిలోనే కాదు దానిని శుద్ధి చేయడంలో కూడా భారత్ నేడు ప్రపంచ అగ్రగామి దేశాల్లో ఒకటిగా నిలిచింది. ఏడాదికి 258 MMTPA రిఫైనింగ్ సామర్థ్యంతో భారత్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రిఫైనర్‌గా ఉంది. మన దేశీయ వినియోగం కంటే శుద్ధి చేసే సామర్థ్యం ఎక్కువగా ఉండటం వల్ల శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతిలో భారత్ ప్రపంచంలోనే 5వ స్థానాన్ని దక్కించుకుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలవడమే కాకుండా విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా భారీగా ఆర్జిస్తోంది.
సంక్షోభంలోనూ స్థిరంగా భారత్..
గత దశాబ్ద కాలంలో ముఖ్యంగా 2014 నుండి 2026 మధ్య కాలంలో భారత్ ఎదుర్కొన్న అంతర్జాతీయ సవాళ్లు అనంతం. కోవిడ్ మహమ్మారి నుంచి రష్యా-ఉక్రెయిన్ మరియు మిడిల్ ఈస్ట్ యుద్ధాల వరకు చమురు ధరలు ప్రపంచవ్యాప్తంగా అస్థిరంగా మారినప్పటికీ భారత్ మాత్రం ధరల స్థిరీకరణలో పటిష్టమైన రికార్డును నమోదు చేసింది. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో (2004–14) పెట్రోల్ ధరలు 112శాతం, డీజిల్ ధరలు 155శాతం పెరగగా, ప్రస్తుత ఎన్డీయే పాలనలో (2014–26) ఆ పెరుగుదల వరుసగా 33శాత, 58శాతానికే పరిమితం కావడం విశేషం. గత ప్రభుత్వం జారీ చేసిన రూ.1.5 లక్షల కోట్ల ఆయిల్ బాండ్ల ఆర్థిక భారాన్ని భరిస్తూనే, ప్రస్తుత ప్రభుత్వం కేంద్ర పన్నులను తగ్గించి వినియోగదారులకు ఊరటనిచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గించకపోవడం వల్ల బీజేపీయేతర రాష్ట్రాలైన తెలంగాణ, కేరళ వంటి ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు రూ.107 పైనే ఉండగా యూపీ, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో రూ.94 కే లభిస్తోంది. కేవలం ధరల నియంత్రణే కాకుండా గత 12 ఏళ్లలో దేశవ్యాప్తంగా ఎక్కడా చమురు సరఫరా ఆగిపోకుండా చూడటం ప్రభుత్వ నిర్వహణా సామర్థ్యానికి నిదర్శనం.
ధరల స్థిరీకరణలో సరిలేరు మనకు
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మండిపోతున్నప్పటికీ భారత ప్రభుత్వం పన్నుల తగ్గింపు, చమురు కంపెనీల సహకారంతో ధరలను సామాన్యుడికి అందుబాటులో ఉంచింది. ఫిబ్రవరి 2022 నుండి 2026 మధ్య కాలంలో పాకిస్థాన్ (+55%), ఫ్రాన్స్ (+19%), జర్మనీ (+21%) వంటి దేశాల్లో పెట్రోల్ ధరలు భారీగా పెరిగితే, భారతదేశంలో మాత్రం ధరలు -0.67% తగ్గాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం వల్ల ద్రవ్యోల్బణం అదుపులో ఉండటమే కాకుండా ఇతర దేశాలతో పోలిస్తే భారత వినియోగదారులు ఆర్థికంగా సురక్షితంగా ఉన్నారు.
ఎల్‌పీజీ – సామాన్యుడికి భారీ భరోసా
మరోవైపు వంట గ్యాస్ ధరల విషయంలో కూడా ప్రభుత్వం అత్యంత మానవీయంగా వ్యవహరించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో గ్యాస్ ధరలు 16శాతం పెరిగినప్పటికీ, దేశీయంగా ఎల్‌పీజీ ధరలను పెంచకుండా కట్టడి చేసింది. గృహ వినియోగదారులను రక్షించడానికి ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు సుమారు రూ. 40,000 కోట్ల నష్టాన్ని భరించాయి. ముఖ్యంగా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు సిలిండర్ ధరను రూ. 553 కే అందజేస్తూ, దక్షిణాసియాలోనే అత్యంత తక్కువ ధరకు గ్యాస్ అందిస్తున్న దేశంగా భారత్ నిలిచింది.
స్వయం సమృద్ధి దిశగా అడుగులు
దిగుమతులపై భారాన్ని తగ్గించుకోవడానికి భారత్ ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. దీనివల్ల ఏటా 4.4 కోట్ల బ్యారెళ్ల చమురు దిగుమతులు తగ్గడమే కాకుండా రూ. 1.36 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అయింది. ఈ మొత్తం భారతీయ రైతులకు ఆదాయంగా చేరడం విశేషం. మొత్తంగా చూస్తే ఇంధన రంగంలో భారత్ నేడు ఎవరి అనుమతిపైనో ఆధారపడకుండా, తన జాతీయ ప్రయోజనాలే పరమావధిగా ఒక శక్తివంతమైన దేశంగా ప్రపంచ పటంపై నిలిచింది.