
నీటి మీద నడవడం అనేది మనుషులకు అసాధ్యం. సాధారణంగా ఏ జీవి అయినా నీటిపై అడుగు వేయగానే మునిగిపోతుంది. కానీ ప్రకృతిలో ఒక వింత జీవి ఉంది.. అది నీటిపై కేవలం నడవడమే కాదు, ఏకంగా పరుగు తీస్తుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. బాసిలిస్క్ బల్లి అని పిలిచే ఈ సరీసృపం తన అద్భుతమైన సామర్థ్యంతో శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. దీని ప్రత్యేకత కారణంగానే దీనిని జీసస్ క్రైస్ట్ బల్లి అని కూడా పిలుస్తారు.
నీటిపై పరుగు.. ఎలా సాధ్యం?
ఈ బల్లి నీటిపై మునిగిపోకుండా పరిగెత్తడం వెనుక ఒక అద్భుతమైన శారీరక నిర్మాణం, భౌతిక శాస్త్రం దాగి ఉన్నాయి. ఈ బల్లి కాళ్ల వేళ్ల మధ్య పల్చని చర్మం ఉంటుంది. ఇది నీటిని బలంగా అదిమి పట్టినప్పుడు, అక్కడ ఒక చిన్న గాలి బుడగ ఏర్పడుతుంది. ఆ గాలి బుడగ పగిలిపోయేలోపే బల్లి తన కాలును బయటకు తీసి మరో అడుగు వేస్తుంది. అంటే అది నీటిపై కాకుండా నీటి మీద ఏర్పడిన గాలి బుడగలపై నడుస్తుందన్నమాట. నీటిలో మునిగిపోకుండా ఉండాలంటే ఇది చాలా వేగంగా పరిగెత్తాల్సి ఉంటుంది. ఇది సెకనుకు సుమారు 1.5 మీటర్ల దూరం పరిగెత్తుతుంది. అంటే మన కనురెప్ప వేసేలోపు అది చాలా దూరం వెళ్లిపోతుంది. ఇంత వేగంగా వెళ్లడం వల్ల భూమి ఆకర్షణ శక్తి దానిని కిందకు లాగలేకపోతుంది.
పరుగులో మూడు దశలు
ఈ బల్లి అడుగు వేసే విధానాన్ని శాస్త్రవేత్తలు మూడు భాగాలుగా చెప్పారు.
కొట్టడం: కాలుతో నీటిని గట్టిగా కొట్టి గాలి బుడగను సృష్టించడం.
నెట్టడం: నీటిని వెనక్కి నెట్టి ముందుకు దూకడం.
కోలుకోవడం: గాలి బుడగ పోకముందే కాలును బయటకు తీయడం.
ఎందుకు ఇలా చేస్తుంది?
కేవలం కాళ్లే కాదు ఈ బల్లి పరుగులో దాని తోక కూడా కీలక పాత్ర పోషిస్తుంది. వేగంగా పరిగెత్తేటప్పుడు పక్కకు పడిపోకుండా ఉండటానికి తన తోకను ఒక చుక్కాని లాగా ఉపయోగిస్తుంది. తోకను ఇరువైపులా ఊపుతూ తన శరీర సమతుల్యతను కాపాడుకుంటుంది. ముఖ్యంగా శత్రువుల నుండి తప్పించుకోవడానికి ఈ బల్లి ఈ వాటర్ రన్ టెక్నిక్‌ను ఉపయోగిస్తుంది. భూమి మీద కంటే నీటి మీద ఇది చాలా వేగంగా ప్రయాణించగలదు. ప్రకృతి ప్రసాదించిన ఈ అద్భుత సామర్థ్యం బాసిలిస్క్ బల్లిని ప్రపంచంలోని అత్యంత వింత జీవుల్లో ఒకటిగా నిలిపింది.