ఆర్థికంగా బలహీన వర్గాలు, మధ్యతరగతి వారి కోసం ఇండియా పోస్ట్ ఒక అద్భుతమైన బీమా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని పోస్ట్ ఆఫీస్ వార్షిక బీమా పాలసీ పథకం అని పిలుస్తారు. దీనిలో ఏడాదికి కేవలం రూ.565 పెట్టుబడితో రూ.10 లక్షల వరకు బీమా పాలసీని పొందవచ్చు. తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులను దృష్టిలో ఉంచుకుని పోస్టాఫీస్ ఈ పథకాన్ని అమలు చేసింది.
తక్కువ ప్రీమియం.. ఈ పథకంలో సంవత్సరానికి రూ.565 మాత్రమే ప్రీమియం అవసరం. ఈ చిన్న పెట్టుబడికి ప్రతిఫలంగా, బీమా పొందిన వ్యక్తి రూ.10 లక్షల వరకు బీమా కవర్ పొందవచ్చు. 18 నుండి 65 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు ఎవరైనా ఈ పథకంలో చేరవచ్చు.
ఈ పథకంలో చేరే ముందు ఎటువంటి మెడికల్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఈ బీమా పాలసీ సహజ మరణాన్ని మాత్రమే కాకుండా ప్రమాదవశాత్తు మరణం, పాక్షిక వైకల్యాన్ని కూడా కవర్ చేస్తుంది. అటువంటి సందర్భాలలో నామినీ రూ.10 లక్షల వరకు క్లెయిమ్ చేయవచ్చు. జీవిత బీమాతో పాటు, ప్రమాద సంబంధిత గాయం కారణంగా ఇన్పేషెంట్ చికిత్స పొందినట్లయితే ఈ పాలసీ రూ.1 లక్ష వరకు వైద్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అంతేకాకుండా బోనస్ ప్రయోజనాలు కూడా ఉంటాయి.
పథకంలో ఎలా నమోదు చేసుకోవాలి?.. పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ పాలసీ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి ఉన్న వ్యక్తులు ఖాతా తెరవడానికి వారి సమీపంలోని పోస్టాఫీసును సందర్శించవచ్చు.
అవసరమైన పత్రాలు.. ఆధార్ కార్డు, పాన్ కార్డు లేదా ఓటరు ఐడి కార్డు, పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ అవసరం. మీరు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసి ప్రీమియం చెల్లించిన తర్వాత, పాలసీ వెంటనే యాక్టివేట్ అవుతుంది.