మనం నిత్యం వాడే గోధుమ పిండి, బియ్యం పిండి లేదా శనగ పిండిలో తేమ చేరడం వల్ల త్వరగా పురుగులు పట్టే అవకాశం ఉంటుంది. దీనివల్ల పిండి పాడైపోవడమే కాకుండా వంటల రుచి కూడా మారుతుంది. రసాయనాలు వాడకుండా ఇంట్లోనే లభించే సహజ పదార్థాలతో ఈ సమస్యను ఎలా పరిష్కరించవచ్చో ఇక్కడ తెలుసుకుందాం..ఈ చిట్కాలు పిండిని ఎక్కువ కాలం తాజాగా ఉంచడమే కాకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని భుజించేలా చేస్తాయి.
బిర్యానీ ఆకులు: బిర్యానీ ఆకులకు ఉండే ప్రత్యేకమైన, ఘాటైన వాసన పురుగులకు అస్సలు పడదు. మీరు పిండిని నిల్వ చేసే డబ్బాలో 2 లేదా 3 బిర్యానీ ఆకులను వేసి ఉంచండి. ఈ వాసన వల్ల పురుగులు లోపలికి ప్రవేశించవు.
ఎండు మిర్చి, లవంగాలు: పిండి డబ్బాలో కొన్ని ఎండు మిరపకాయలు లేదా 5-6 లవంగాలను వేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వీటిలోని ఘాటు గుణాలు పురుగులను దరిచేరనివ్వవు. ముఖ్యంగా లవంగాలు తేమను కూడా కొంతవరకు పీల్చుకుంటాయి.
వేపాకులు : వేపాకుల్లో సహజ సిద్ధమైన క్రిమిసంహారక గుణాలు ఉంటాయి. కొన్ని ఎండిన వేపాకులను ఒక పలుచని కాటన్ వస్త్రంలో కట్టి పిండి డబ్బా అడుగున వేయండి. ఇది పిండిని పురుగులు పట్టకుండా రక్షించడమే కాకుండా బ్యాక్టీరియా చేరకుండా చూస్తుంది.
ఎయిర్ టైట్ కంటైనర్లు: పిండిని నిల్వ చేసే విధానం కూడా చాలా ముఖ్యం. గాలి చొరబడని స్టీల్ లేదా గాజు డబ్బాల్లో నిల్వ చేయడం వల్ల తేమ లోపలికి వెళ్లదు. ప్లాస్టిక్ కవర్లలో ఉంచడం కంటే ఇలా చేయడం వల్ల పిండి ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది.
ఫ్రిజ్లో నిల్వ చేయడం: మీ దగ్గర తక్కువ పరిమాణంలో పిండి ఉంటే, దానిని ఒక జిప్ లాక్ కవర్లో పెట్టి ఫ్రిజ్లో ఉంచవచ్చు. తక్కువ ఉష్ణోగ్రత వద్ద పురుగులు పెరగలేవు. పిండిని వాడే ముందు ఒకసారి ఎండలో పెట్టడం లేదా తేలికగా వేయించడం వల్ల కూడా పురుగులు రాకుండా ఉంటాయి. పిండిని నిల్వ చేసే డబ్బా ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. తడి చేతులతో పిండిని తీయడం మానుకోవాలి.





