
ప్రకృతి ప్రసాదించిన అత్యంత శక్తివంతమైన వనమూలికలలో అల్లం ఒకటి. భారతీయులు దాదాపు వేల సంవత్సరాలుగా అల్లాన్ని తమ సంప్రదాయ వైద్యంలో, వంటకాల్లో భాగంగా చేసుకున్నారు. అల్లంలో అనేక విలువైన పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అల్లంలో జింజెరోల్ (Gingerol) అనే ముఖ్యమైన బయోయాక్టివ్ సమ్మేళనం ఉంటుంది. దీంతోపాటు.. విటమిన్ సి, బి6, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్.. తోపాటు.. యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి శరీర ఆరోగ్యానికి ఎంతో కీలకం. అందుకే.. అల్లంతో అద్భుతమైన వైద్యం చేయవచ్చని చెబుతారు ఆయుర్వేద వైద్యులు.. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడం నుంచి.. వికారం, కీళ్ల నొప్పులు, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు..
అల్లం ఒక మంచి ఔషధంగా పనిచేయడమే కాకుండా, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా కూడా ప్రసిద్ధి చెందింది. ఇది రక్త శుద్ధికి తోడ్పడుతుంది, రక్తనాళాలలో రక్తం గడ్డకట్టకుండా సహాయపడుతుంది. క్రమం తప్పకుండా అల్లం వాడటం వలన కొన్ని వారాల్లో కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుందని పేర్కొంటున్నారు ఆయుర్వేద నిపుణులు.. అల్లం కడుపులో పూత ఏర్పడకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. అలాగే, ఇది నోటి దుర్వాసనను సమర్థవంతంగా పోగొట్టి, నోటిలో చేరిన ప్రమాదకర బ్యాక్టీరియాను సంహరించి దంతాలను ఆరోగ్యముగా ఉండేలా చేస్తుంది.
సిడ్నీ విశ్వవిద్యాలయం పరిశోధనల్లో అల్లం షుగర్ జబ్బు నియంత్రణ చేయగలిగిన శక్తివంతమైన ఔషధంగా వెల్లడైంది. అల్లం రక్తములోని చక్కెరలు కండరాలకు చేరే ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా మధుమేహ నిర్వహణలో సహాయపడుతుంది. అజీర్తితో బాధపడుతున్న వారికి అల్లం సేవించడం వల్ల ఉపశమనం కలుగుతుంది. ఉదరంలో గ్యాస్ ఏర్పడినప్పుడు అల్లం దివ్యౌషధంలా పనిచేస్తుంది. దగ్గు, జలుబు, కఫం వంటి శ్వాసకోశ సమస్యలకు అల్లం అమృతంలా పనిచేస్తుందని అనడంలో సందేహం లేదు. ఇది జీర్ణక్రియ సాఫీగా జరిగేలా ఉపయోగపడుతుంది.
నిమ్మరసం, అల్లంతో అద్భుత ప్రయోజనాలు..
నిమ్మకాయ, మంచి సువాసన మరియు రుచి కలిగిన సిట్రస్ జాతికి చెందిన పండు. దీనికి ఉన్న యాంటీ బాక్టీరియల్ గుణాలు, అధిక విటమిన్ సి కంటెంట్ ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. నిమ్మలో పుష్కలంగా ఉండే విటమిన్ సి, అనేక అనారోగ్య సమస్యలకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. నిమ్మ వలన జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది. అజీర్ణం వలన ఏర్పడిన గ్యాస్, ఎసిడిటీ లాంటి సమస్యలకు నిమ్మరసం ఎంతో మేలు చేస్తుంది.
నిమ్మ, అల్లం కలిపిన పానీయం రోజువారీ తీసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఈ పానీయాన్ని తయారుచేయడానికి, అల్లాన్ని శుభ్రంగా కడిగి, దంచి ఒక గ్లాసు నీళ్ళల్లో మరిగించి, దానికి ఒక నిమ్మకాయ రసం కలిపి రోజూ తీసుకోవాలి. నిమ్మలో ఉన్న విటమిన్ సి కొవ్వును కరిగించి బరువు తగ్గించేందుకు సహాయపడుతుంది. అల్లం కూడా శరీరంలోని ఫ్యాట్‌ను కరిగిస్తుంది. ఈ పానీయం బరువు తగ్గించడమే కాకుండా, ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌పై పోరాటం చేస్తాయి.
ఈ పానీయం రోజు తీసుకోవడం వలన చర్మ సౌందర్యం పెరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది. అల్లం, నిమ్మరసం పానీయంలో ఉండే పోషకాలు క్యాన్సర్ కణాలపై పోరాటం చేస్తాయి. వికారం సమస్య నుండి ఉపశమనం పొందడానికి కూడా ఈ పానీయం ఉపయోగపడుతుంది. దగ్గు నుండి మంచి ఉపశమనం అందించడానికి, ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియా గుణాలు దగ్గు వలన వస్తున్న ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. రోజువారీ ఈ పానీయం తాగడం వలన మైగ్రేన్ తలనొప్పి నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.
అయితే.. ఈ డ్రింక్ ఉదయాన్నే తాగితే.. ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.. కానీ.. మీకు ఏమైనా అనారోగ్య సమస్యలుంటే.. వినియోగించే ముందు వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..