ఓ వైపు విమాన ప్రమాదాలు భయపెడుతుంటే.. కొంతమంది చేసే పనుల వల్ల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి కొంతమంది విమానంలో రహస్యంగా ప్రయాణించడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే ఎన్నో ఘటనలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. తాజాగా ఓ బాలుడు చేసిన పనికి అధికారులతో పాటు అంతా అవాక్కయ్యారు. కాబూల్ నుండి బయలుదేరిన ఒక విమానం ల్యాండింగ్ గేర్ కంపార్ట్మెంట్లో దాక్కుని ఒక 13 ఏళ్ల ఆఫ్ఘన్ బాలుడు ఢిల్లీకి చేరుకున్నాడు. ఈ అసాధారణ సంఘటన ఆదివారం ఉదయం ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో వెలుగులోకి వచ్చింది.
ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లోని కుందుజ్ నగరానికి చెందిన ఈ బాలుడు కాబూల్ విమానాశ్రయంలోని నిషేధిత ప్రాంతంలోకి చొరబడి KAM ఎయిర్ విమానం RQ-4401 ల్యాండింగ్ గేర్ కంపార్ట్మెంట్లో దాక్కున్నాడు. ఈ విమానం రెండు గంటల ప్రయాణం తర్వాత ఉదయం 11:00 గంటలకు ఢిల్లీ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన తర్వాత ఈ విషయం బయటపడింది. విమానం ల్యాండ్ అయిన వెంటనే ఆ బాలుడిని గుర్తించిన సిబ్బంది వెంటనే భద్రతా సిబ్బందికి అప్పగించారు. బాలుడు చెప్పిన విషయాలు విని అధికారులు అవాక్కయ్యారు. ప్రమాదాలను పట్టించుకోకుండా కేవలం ఉత్సుకతతో విమానంలోకి ప్రవేశించానని బాలుడు తెలిపాడు. అదేరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ఢిల్లీ నుండి బయలుదేరిన అదే విమానంలో అతన్ని తిరిగి ఆఫ్ఘనిస్తాన్‌కు పంపించారు.
భద్రతా తనిఖీలు
ఈ సంఘటన తరువాత KAM ఎయిర్‌లైన్స్ భద్రతా సిబ్బంది విమానం ల్యాండింగ్ గేర్ కంపార్ట్మెంట్ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో బాలుడికి చెందిన ఒక చిన్న ఎర్రటి స్పీకర్ లభించింది. భద్రతా తనిఖీల అనంతరం విమానం సేఫ్ అని నిర్ధారించారు. ఈ సంఘటన విమానాశ్రయ భద్రతా లోపాలపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..