తమిళనాట మరో కొత్త పార్టీ.. చిన్నమ్మ పొలిటికల్ ఎంట్రీ.. ఆ నేతలకు సవాల్..

తమిళనాట మరో కొత్త పార్టీ.. చిన్నమ్మ పొలిటికల్ ఎంట్రీ.. ఆ నేతలకు సవాల్..


తమిళనాడు రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి, అందరూ చిన్నమ్మ అని పిలుచుకునే శశికళ తన కొత్త రాజకీయ ప్రస్థానాన్ని అధికారికంగా ప్రారంభించారు. జయలలిత జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆమె తన కొత్త రాజకీయ పార్టీ జెండాను ఆవిష్కరించారు. శశికళ ఆవిష్కరించిన పార్టీ జెండాను నలుపు, తెలుపు, ఎరుపు రంగులతో ఉంది. అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశం ఏంటంటే.. ఈ జెండా మధ్యలో ద్రవిడ రాజకీయ దిగ్గజాలు అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత ముఖచిత్రాలను పొందుపరిచారు. తద్వారా తానే జయలలిత అసలైన రాజకీయ వారసురాలినని ఆమె పరోక్షంగా కేడర్‌కు సంకేతాలు పంపారు.

కన్నీటి పర్యంతమైన శశికళ

సభలో ప్రసంగిస్తూ శశికళ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. జయలలిత మరణం తర్వాత తనపై జరిగిన దుష్ప్రచారాన్ని గుర్తు చేసుకుని ఆమె కన్నీరు పెట్టుకున్నారు. జయలలిత నేనే హత్య చేశానని ప్రచారం చేసి నా మనసును గాయపరిచారు. జయలలిత మరణించిన సమయంలో నేను తీవ్రమైన దుఃఖంలో ఉన్నాను. అందుకే అప్పుడు చాలా మంది బతిమలాడినా నేను పార్టీ అధ్యక్ష పదవిని గానీ, సీఎం పదవిని గానీ తీసుకోలేదు అని శశికళ ఆవేదన వ్యక్తం చేశారు.

పన్నీర్‌ సెల్వం, పళనిస్వామిపై ..

ప్రస్తుత అన్నాడీఎంకే అగ్రనాయకత్వంపై ఆమె నిప్పులు చెరిగారు. పన్నీర్‌ సెల్వం అప్పట్లో ఆయన తనను తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తు చేశారు. పళనిస్వామిని సీఎంను చేయడం తాను చేసిన అతి పెద్ద పొరపాటు అని ఆమె తెలిపారు. ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత తనను ఒక చిత్తుకాగితంలా చూశారని, చివరకు హీనంగా పార్టీ నుంచి బహిష్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇకపై చిన్నమ్మ మార్క్ పాలిటిక్స్

జయలలిత చనిపోయిన తర్వాత తమిళనాట అనేక చిత్ర విచిత్రాలు జరిగాయని, ఇకపై తాను మౌనంగా ఉండబోనని శశికళ స్పష్టం చేశారు. ‘‘తమిళ రాజకీయాల్లో ఇక నా మార్క్ చూపిస్తాను.. ప్రజల కోసం యాక్టివ్‌గా పని చేస్తాను’’ అని ఆమె ప్రకటించారు. పార్టీ పేరు, విధివిధానాలపై త్వరలోనే స్పష్టమైన ప్రకటన చేస్తానని ఆమె తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *