హైదరాబాద్, సెప్టెంబర్ 20: రైల్వే స్టేషన్ సమీపంలో గోతంలో చుట్టిన మూట ఒకటి స్థానికంగా కలకలం రేపింది. మూట నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మూట విప్పి చూడగా ఒక్కసారిగా గుప్పుమని దుర్వాసన ఆ ప్రాంతాన్నంతా కబలించింది. ఇక మూటలోపల ఓ మహిళ మృత దేహం ఉండటంతో పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఆనక గంటల వ్యవధిలోనే మర్డర్ మిస్టరీని చేధించారు. ఈ షాకింగ్ ఘటన చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..
చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో సంచిలో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు గంటల వ్యవధిలోనే మొత్తం మిస్టరీని చేధించారు. మృతురాలిని పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రమీలగా గుర్తించారు. ప్రమీల గత కొన్నేళ్లుగా భర్తకు దూరంగా ఉంటోంది. ఆ తర్వాత ఓ బెంగాలీ యువకుడితో పరిచయం ఏర్పడటంతో ఇద్దరూ కలిసి హైదరాబాద్‌లోని కొండాపుర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఏం జరిగిందో తెలియదుగానీ సదరు బెంగాల్ యువకుడు ప్రమీలను చంపి మూట కట్టి.. కొండాపుర్ నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు వచ్చాడు.
ఆనక మృతదేహాన్ని స్టేషన్ గోడపక్కన వదిలేసి చక్కాపోయాడు. మూటలో మృతదేహం వ్యవహారం కలకలం రేగడంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తించారు. మూట వదిలిన నిందితుడు రైల్వే స్టేషన్ వెయిటింగ్ హాల్‌లోకి వెళ్లి అక్కడే దుస్తులు మార్చుకున్నాడు. అక్కడి నుంచి అస్సాం పారిపోయాడు. పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.