ఈ ఏడాది మార్చి 3, మంగళవారంనాడు కేతు గ్రస్త చంద్రగ్రహణం సంభవించనుంది. ఈ చంద్ర గ్రహణం మనదేశంలోనూ కనిపిస్తుంది. అయితే, చంద్రగ్రహణం సందర్భంగా పలు నియమాలను పాటించడం హిందూ సంప్రదాయంలో పురాతన కాలం నుంచి వస్తోంది. గ్రహణ సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక ఆలయాలు కొన్ని గంటలపాటు మూతపడనున్నాయి. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం మంగళవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 వరకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అదే విధంగా తెలుగు రాష్ట్రాల్లోని చాలా దేవాలయాలు కూడా గ్రహణ సమయానికి అనుగుణంగా తలుపులు మూసివేయనున్నాయి. గ్రహణ దోషం లేని ఆలయాలు మాత్రం యథావిధిగా భక్తులకు దర్శనం ఉంటుంది. అయితే, గ్రహణ సమయంలో ఆలయాలు ఎందుకు మూసివేస్తారు? దాని వెనుక ఉన్న పరమార్థం ఏమిటి? తెలుసుకుందాం.
గ్రహణ సమయంలో ఆలయాలు ఎందుకు మూసివేస్తారు?..
భారతీయ సంస్కృతిలో సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వంటి ఖగోళ సంఘటనలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. హిందూ సంప్రదాయం ప్రకారం గ్రహణ సమయాన్ని అపవిత్రమైన లేదా శుభకార్యాలకు అనుకూలం కాని కాలంగా భావిస్తారు. ఈ సమయంలో ప్రతికూల శక్తులు ప్రభావం చూపుతాయని నమ్మకం ఉంది. అందువల్ల దేవాలయాల తలుపులను మూసి ఉంచడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
పురాణ కథనం..
స్కంద పురాణం ప్రకారం, క్షీరసాగర మథనం సమయంలో ఉద్భవించిన అమృతం కోసం దేవతలు, దానవులు పోటీ పడతారు. లోకాల రక్షణ కోసం మోహిని అవతారంలో శ్రీ మహావిష్ణువు దేవతలకు మాత్రమే అమృతాన్ని పంచుతాడు. అయితే రాహు, కేతువులు మాయగా దేవతల మధ్య కూర్చొని అమృతాన్ని స్వీకరిస్తారు. ఈ విషయం గ్రహించిన సూర్యుడు, చంద్రుడు విష్ణువుకు తెలియజేయగా, విష్ణువు సుదర్శన చక్రంతో రాహు, కేతువుల శిరస్సులను వేరు చేస్తాడు. అప్పటికే అమృతం కంఠం వరకు చేరడంతో వారి తలభాగం అమరత్వం పొందుతుంది. అప్పటి నుంచే రాహువు సూర్యుడిని, కేతువు చంద్రుడిని మింగేందుకు ప్రయత్నిస్తారని, ఆ సమయంలోనే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సంభవిస్తాయని పురాణ గాథ చెబుతోంది.
అపవిత్ర కాలంగా గ్రహణ సమయం..
ఈ పురాణ విశ్వాసాల ఆధారంగా గ్రహణ సమయాన్ని అపవిత్రంగా భావించడం ప్రారంభమైంది. దేవతా విగ్రహాలపై ప్రతికూల ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో గ్రహణానికి ముందు ఆలయాలను మూసివేస్తారు. గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాన్ని శుద్ధి చేసి, విగ్రహాలకు అభిషేకం నిర్వహించిన అనంతరం పూజలను పునఃప్రారంభిస్తారు.
శుద్ధి ప్రక్రియ..
గ్రహణం అనంతరం ఆలయంలో ప్రత్యేక శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో..
విగ్రహాలకు పవిత్ర జలాలతో స్నపన (అభిషేకం)
ఆలయ ప్రాంగణ శుభ్రత
మంత్రోచ్ఛారణలతో పునఃప్రతిష్ట భావన
ఇవి జరుగుతాయి. తద్వారా ఆలయంలో మళ్లీ పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.
శాస్త్రీయ కోణం – జాగ్రత్తలు..
శాస్త్రీయంగా గ్రహణం అనేది సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే రేఖలో రావడం వల్ల సంభవించే సహజ ఖగోళ సంఘటన. అయితే పూర్వకాలంలో గ్రహణాన్ని అపశకునంగా భావించి కొన్ని జాగ్రత్తలు సూచించారు. ముఖ్యంగా ఆహారం తీసుకోవడం నివారించడం, గర్భిణీలు జాగ్రత్తలు పాటించడం వంటి ఆచారాలు ఏర్పడ్డాయి.
ఆలయాలను మూసివేయడం కూడా అదే సంప్రదాయానికి భాగంగా ఏర్పడింది. ఇది ప్రధానంగా ఆధ్యాత్మిక విశ్వాసాల ఆధారంగా కొనసాగుతున్న ఆచారం.
మొత్తానికి, గ్రహణ సమయంలో ఆలయాలు మూసివేయడం అనేది పురాణ విశ్వాసాలు, ఆధ్యాత్మిక భావనలు, సంప్రదాయ ఆచారాల సమ్మిళిత రూపం. గ్రహణం ముగిసిన తర్వాత శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి, భక్తులకు తిరిగి దర్శనాలు కల్పిస్తారు.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)





