
ఇండియాలోని కంపెనీలు సమాన అవకాశాల గురించి ఎన్నో సంవత్సరాలుగా మాట్లాడుతున్నాయి. అయితే ఉన్నత నాయకత్వ స్థాయికి చేరుకునే సమయంలో పురుషులు, మహిళల ప్రయాణం ఇంకా భిన్నంగా ఉంటోందని తాజా అధ్యయనం స్పష్టం చేసింది. సమస్య ఆశయంలో లేదని, సంస్థల నిర్మాణాత్మక విధానాల్లోనే ఉందని నిపుణులు చెబుతున్నారు. ‘జెండర్ అండ్ లీడర్‌షిప్ ఎట్ ఇండియా ఇంక్’ పేరుతో నిర్వహించిన ఈ అధ్యయనంలో పురుషులు, మహిళలు రెండూ కెరీర్ వృద్ధి, ఉద్దేశ్యపూర్వక పని, బలమైన నాయకత్వ సంస్కృతిని సమానంగా కోరుకుంటున్నట్లు తేలింది. అయితే 50 ఏళ్ల వయస్సుకు చేరుకునే సమయానికి దాదాపు 49 శాతం మంది పురుషులు ఒకే సంస్థలో సీనియర్ నాయకత్వ స్థానాలకు ఎదగగా, మహిళల్లో ఆ సంఖ్య కేవలం 20 శాతం మాత్రమే. అంటే మహిళలు నాయకత్వ స్థాయికి చేరడానికి తరచుగా కంపెనీలు మార్చాల్సి వస్తోంది.
మహిళలకు ఎక్కువ కెరీర్ మార్పులు
సగటున మహిళలు 4.13 కెరీర్ మార్పులు చేస్తుండగా, పురుషులు 3.17 మార్పులు మాత్రమే చేస్తున్నారు. సంస్థలలో స్పష్టమైన ప్రమోషన్ మార్గాలు లేకపోవడం వల్ల మహిళలు సహాయక మేనేజర్లు, మంచి పని సంస్కృతి లేదా కొత్త అవకాశాల కోసం ఇతర కంపెనీలను ఆశ్రయించాల్సి వస్తోంది. మహిళా నాయకులలో సగం మంది మానవ వనరులు (HR), కమ్యూనికేషన్లు వంటి సహాయక పాత్రల్లో ప్రారంభం అవుతున్నారు. అయితే పురుషులు ఎక్కువగా ఆదాయాన్ని నేరుగా ప్రభావితం చేసే ‘కోర్ బిజినెస్’ పాత్రల్లో ఉంటున్నారు. ఈ కోర్ పాత్రలే సాధారణంగా సీనియర్ నాయకత్వానికి సోపానాలు. 35 ఏళ్లలోపు వయసున్న నాయకుల్లో 38 శాతం మహిళలు సహాయక పాత్రల్లో ఉండగా, పురుషుల్లో అది 22 శాతం మాత్రమే.
లాభనష్టాల (P&L) బాధ్యత నిర్వహణలో 91 శాతం పురుషులకు అనుభవం ఉండగా, మహిళల్లో అది 68 శాతం మాత్రమే. అమ్మకాల అనుభవం విషయంలో అంతరం ఇంకా ఎక్కువ 90 శాతం పురుషులు, 45 శాతం మహిళలు మాత్రమే ఈ అనుభవాన్ని పొందారు. ఈ అనుభవాలు ఉన్నత పదవులకు కీలకంగా పరిగణించబడతాయి. 84 శాతం పురుషులు నాయకత్వ నిర్ణయాలు నిష్పాక్షికంగా ఉంటాయని నమ్ముతుండగా, మహిళల్లో 65 శాతం మాత్రమే అలా భావిస్తున్నారు. వ్యవస్థ న్యాయంగా లేదనే భావన ఉన్నప్పుడు, అధిక బాధ్యత లేదా రిస్క్ తీసుకునే పాత్రలను చేపట్టడంలో మహిళలు వెనుకడుగు వేయవచ్చు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం సమస్య ప్రతిభ కొరతలో లేదు. అది వ్యవస్థల రూపకల్పనలో ఉంది. కంపెనీలు అధిక ప్రభావశీల పాత్రలను ఎలా కేటాయిస్తున్నాయి? ప్రమోషన్లు ఎలా నిర్ణయిస్తున్నాయి? కెరీర్ మార్గాలు ఎంత పారదర్శకంగా ఉన్నాయి? అనే అంశాలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉంది. కార్పొరేట్ భారతదేశంలోని మహిళలకు ఆశయం ఇప్పటికే ఉంది. ఇప్పుడు అవసరమైంది. ఆ ఆశయాన్ని సాకారం చేసుకునే సమాన అవకాశాల వేదిక.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి