మహారాష్ట్రలోని ముంబైకి ఆనుకుని ఉన్న డోంబివలిలో కాంగ్రెస్ కార్యకర్త ప్రకాష్ మామా పగరే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్ఫింగ్ చేసిన అభ్యంతరకర ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో రాజకీయ దుమారం చెలరేగింది. ఈ ఫోటో బీజేపీ నేతలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ పోస్ట్‌ను ప్రధాని మోదీని అవమానించడమేనని పేర్కొంటూ బీజేపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. అయితే, బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకుడిని పిలిచి చీర కట్టుకోమని బలవంతం చేయడంతో సంఘటన నాటకీయ మలుపు తిరిగింది.
ఉల్హాస్‌నగర్ ప్రాంతానికి చెందిన 73 ఏళ్ల మామా పగారే కాంగ్రెస్ నాయకులుగా కొనసాగుతున్నారు. మామా పగారే ప్రధాని మోదీపై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్ట్ చేయడంతో బీజేపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. కళ్యాణ్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నందు పరాబ్ నాయకత్వంలో మమా పగారేను పట్టుకుని నిరసన తెలిపారు. పగారే చేసిన చర్యను దేశ అత్యున్నత నాయకత్వాన్ని అవమానించారని పేర్కొన్నారు. ప్రతీకారంగా, బీజేపీ కార్యకర్తలు పగారేను పిలిచి, అతనికి చీర కట్టించారు. ఇందుకు సంబంధించి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది కాస్త వైరల్‌గా మారింది.
వీడియో చూడండి..
ప్రధానమంత్రి అసహ్యకరమైన చిత్రాన్ని పోస్ట్ చేయడం అవమానకరమైనదే కాదు, ఆమోదయోగ్యం కాదన్నారు పరాబ్. మన నాయకులను అప్రతిష్టపాలు చేయడానికి ఇలాంటి ప్రయత్నాలు మళ్లీ జరిగితే, బీజేపీ మరింత తీవ్రంగా స్పందిస్తుందని ఆయన హెచ్చరించారు.
అయితే, కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రతిస్పందనను తీవ్రంగా తప్పుబట్టింది. కళ్యాణ్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సచిన్ పోటే మాట్లాడుతూ, పగారే 73 ఏళ్ల సీనియర్ పార్టీ కార్యకర్త అని అన్నారు. అతను ఏదైనా అభ్యంతరకరమైన పోస్ట్ చేసి ఉంటే, పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండాల్సిందన్నారు. బీజేపీ కార్యకర్తలు ఇలా చీర కట్టుకోమని బలవంతం చేయడం సరియైనది కాదన్నారు. బీజేపీ మద్దతుదారులు తరచుగా కాంగ్రెస్ అగ్ర నాయకులపై అవమానకరమైన కంటెంట్‌ను పోస్ట్ చేస్తారని, కానీ తాను వారిలా ప్రవర్తించలేదని సచిన్ పోటే తెలిపారు. ఈ సంఘటనలో పాల్గొన్న వారిపై పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..