తోడేలుల దాడులతో ఆ గ్రామం కంటి మీద కునుకు లేకుండా గడుపుతోంది. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆ ఊరి జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సాధారణంగా గ్రామాలు, పట్టణాల్లో కుక్కలు దాడులు జరుగుతున్నాయని ఈ మధ్య తరచూ వింటున్నాం. కుక్కల దాడిలో ఎంతో మంది చిన్నారుల దగ్గర నుంచి పెద్దవాళ్లు సైతం గాయాల పాలవుతున్న ఘటనలూ చూస్తున్నాం. కానీ, ఇక్కడ ఏకంగా తోడేళ్లతో పెద్ద తలనొప్పిగా మారింది. రాత్రీ పగలూ అనే తేడా లేకుండా ఊళ్లో బతకాలంటేనే, తోడేళ్ల బారి నుంచి తమను తాము రక్షించుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బహ్రైచ్ జిల్లాలో తోడేళ్ల దాడులు పెరిగి ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యాపించాయి. గత వారం రోజులుగా ఆరు దాడులు జరగగా.. అందులో ఓ చిన్నారి ప్రాణం కోల్పోయింది. మరో మహిళ, యువకుడు సహా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరిని స్థానిక మెడికల్ కాలేజ్‌లో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు స్పందించారు. ఇతర జిల్లాల నుంచి సిబ్బందిని పిలిపించామని, తోడేలును పట్టుకునేందుకు పంజరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే డ్రోన్ కెమెరా సాయంతో కూడా మానిటరింగ్ చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఇదిలా ఉండగా.. ఒకటి కాదు, రెండు కాదు.. బౌండీ థానా పరిధిలో ఏకంగా ఒకేసారి మూడు సార్లు దాడులు జరగడంతో గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
మొదటి ఘటన మంజారా తౌక్లీ పరిధిలో చోటు చేసుకుంది. బభనన్పుర్వాకు చెందిన 60 ఏళ్ల శివప్యారీ అనే మహిళ తన ఇంటి వద్ద పశువులకు ఆహారం పెడుతుండగా ఓ తోడేలు అకస్మాత్తుగా వెనుక నుంచి దాడి చేసింది. ఆ దాడిలో ఆమె తల, మెడకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ప్రస్తుతం బాధితురాలు మెడికల్ కాలేజ్‌లో చికిత్స పొందుతున్నారు. అదే విధంగా రెండో ఘటన సిపహియా హులాస్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన 18 ఏళ్ల ఆదర్శ్ శుక్లా నిద్రపోతుండగా ఓ తోడేలు ఉన్నట్లుండి దాడి చేసింది. అయితే.. ఆ బాలుడు అక్కడే ఉన్న కుర్చీతో తోడేలుపై ధైర్యంగా ఎదురుదాడి చేసి తన ప్రాణాలను కాపాడుకున్నాడు.
ఇక భౌరీ బహోర్వా గ్రామంలో మూడో ఘటన జరిగింది. రాజ్శ్రీ అనే మహిళ తన మూడు నెలల పసిపాపకు పాలు ఇస్తుండగా తోడేలు బిడ్డను ఎత్తుకెళ్లింది. ఎదుర్కొనే వీలు కూడా లేకుండా ఆ తోడేలు బిడ్డను తీసుకుని దూరప్రాంతానికి పరిగెత్తింది. దాడిలో తన చిన్నారి మృతి చెంది ఉంటుందని భావించి గ్రామస్థుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టగా.. అక్కడ శిశువు దుస్తులు, చేయికి పెట్టిన బంగడాలు కనిపించాయి. అలాగే మరి కొంత దూరంలో శిశువు తల భాగం లభ్యమైంది.
మరోవైపు, నరేశ్ పుర్వాకు చెందిన సారథీదేవి, హరిరామ్ పుర్వాకు చెందిన మదన్, నంద్వల్ గ్రామానికి చెందిన 70 ఏళ్ల చండ్రా దేవి మీద కూడా తోడేలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఇలా బహ్రైచ్ జిల్లాలోని చాలా గ్రామాల్లో తోడేళ్ల బెడద ఎక్కువైంది. తోడేళ్ల దాడుల్లో గాయపడిన వారందరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డీఎఫ్ఓ రామ్‌సింగ్ యాదవ్ ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. గ్రామస్తులకు జాగ్రత్తలు చెబుతున్నాం. పలు జిల్లాల నుంచి సిబ్బందిని రప్పించాం. డ్రోన్ కెమెరాల సాయంతో మానిటరింగ్ చేస్తున్నామని అన్నారు.
మరోవైపు, దాడులకు గురవుతున్న గ్రామస్థులు.. మా మీద దాడులు జరుగుతున్నా ఇప్పటివరకు తోడేలును పట్టుకోవడంలో అధికారుల నుంచి ఎలాంటి చర్యలు కనబడడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భయంతో రాత్రి సమయాల్లో నిద్ర కూడా పట్టడం లేదని చెబుతున్నారు. గత ఏడాది సైతం మహ్సీ ప్రాంతం సహా బహ్రైచ్‌లో తోడేలుల ఉగ్రరూపం చూశామని అప్పటి ఘోరాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
గతంలో 10 మంది పిల్లలు, ఒక మహిళ మృతి చెందగా.. 60 మందికి పైగా గాయపడ్డారని.. ఆ సమయంలో 6 తోడేళ్లను పట్టుకున్నప్పటికీ నెలల తరబడి ఆ సమస్యతో ప్రజలు భయాందోళనలో జీవించినట్లు చెబుతున్నారు. అధికారులు, రక్షణ యంత్రాంగం స్పందించి తోడేళ్ల బెడద నుంచి తమను ఎలాగైనా కాపాడాలని బహ్రైచ్ జిల్లాల ప్రజలు కోరుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..