హైదరాబాద్ మహానగరాన్ని శుక్రవారం రాత్రి భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. కుండపోత వానకు నగరం అస్తవ్యస్తంగా మారింది. జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో మూసీనది ఉగ్రరూపం దాల్చి, మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్) ప్రాంగణాన్ని పూర్తిగా ముంచెత్తింది. వందలాది మంది ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు గంటల తరబడి బస్టాండ్‌లోనే చిక్కుకుపోయి తీవ్ర భయాందోళనలకు, ఇబ్బందులకు గురయ్యారు. మూసీ ప్రవాహం అర్ధరాత్రి తర్వాత ఒక్కసారిగా పెరిగి, గండిపేట నుంచి నాగోల్ వరకు నది ప్రమాదకర స్థాయిలో ప్రవహించింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించారు. అర్ధరాత్రి సమయంలోనే ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించి, బస్టాండ్‌లో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావాలని పోలీసు, జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.