ఎంత సంపాదించినా నెలాఖరుకు జేబు ఖాళీ అవుతోందా? ఈ ఆర్థిక సమస్యను అధిగమించడానికి నిపుణుల చిట్కాలను పాటించండి. ఖర్చులను ట్రాక్ చేయండి, నెలవారీ బడ్జెట్ రూపొందించండి, జీతం రాగానే పొదుపుకు ప్రాధాన్యత ఇవ్వండి. అనవసర ఖర్చులను, బయటి భోజనాలను తగ్గించండి. ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేయండి. ఆవేశపు కొనుగోళ్లు నివారించి, వాడని సబ్‌స్క్రిప్షన్లు రద్దు చేయడం ద్వారా ఆర్థిక భద్రత పొందండి. పూర్తి డిటెల్స్ ఇక్కడ తెలుసుకుందాం..
మొదట ఖర్చులపై స్పష్టమైన అంచనా పెట్టడం అత్యంత ముఖ్యం. నెలలో వచ్చే ఆదాయం, ఖర్చులు, అప్పులు అన్నింటినీ ఒక లాగ్ లేదా బడ్జెట్ ప్లాన్‌లో రాయడం వల్ల ఎక్కడ అధిక ఖర్చు జరుగుతుందో తెలుస్తుంది. ముఖ్యంగా ఫుడ్, షాపింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ లాంటి ఖర్చులను తగ్గించడం అవసరం. అందుకోసం ప్రతిరోజూ మీరు చేసే చిన్న ఖర్చును కూడా ఒక డైరీలో లేదా మొబైల్ యాప్‌లో రాసుకోండి. ఇలా చేయడం వల్ల అనవసరంగా ఎక్కడ డబ్బు వృథా అవుతుందో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. నెల మొదట్లోనే ఆ నెలకు బడ్జెట్ సిద్ధం చేసుకోండి. రెంట్, కరెంట్ బిల్లులు, సరుకుల కోసం డబ్బు పక్కన పెట్టండి. జీతం రాగానే ముందుగా పొదుపు చేసి, ఆ తర్వాతే ఖర్చు చేయడం అలవాటు చేసుకోండి.
అవసరం ఉన్న వస్తువులను ఆఫర్లు లేదా డిస్కౌంట్లు ఉన్నప్పుడు మాత్రమే కొనండి. సేల్ సమయంలో ఎక్కువ మొత్తంలో కొనుక్కుంటే చాలా డబ్బు ఆదా అవుతుంది. అయితే కొనమన్నాం కదా అని అవసరం లేనివన్నీ క్రెడిట్ కార్డులు వాడి కొనేసి అప్పుల తలనొప్పులు తెచ్చుకోవద్దు. వారానికి ఒకసారి మించి బయట భోజనాలు తినడం తగ్గించండి. హోమ్ ఫుడ్ వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాదు, మీ వాలెట్‌లో డబ్బు కూడా మిగులుతుంది. చిన్న టీ, స్నాక్స్ ఖర్చులే నెలాఖరుకి భారంగా మారుతుంటాయి. వాటి మీద కూడా ఒక కన్నేసి ఉంచండి.
ఇవి కూడా చదవండి
ఏదైనా వస్తువు నచ్చినప్పుడు వెంటనే కొనెయ్యకుండా 48 గంటలు ఆగండి. ఆ తర్వాత కూడా అది నిజంగా అవసరం అనిపిస్తేనే కొనండి. దీనివల్ల ఇంపల్సివ్ షాపింగ్ అంటే ఆవేశంలో ఖర్చుపెట్టటం తగ్గుతుంది. ప్రతి నెల చిన్న మొత్తమైనా సరే ఎమర్జెన్సీ ఫండ్ కోసం పక్కన పెట్టండి. అనుకోని ఆరోగ్య సమస్యలు లేదా ఏదైనా వాహన, ఇంటి రిపేర్లు వంటి ఖర్చులు అనుకోకుండా మీద పడితే అప్పు చేయాల్సిన అవసరం లేకుండా ఇది మిమ్మల్ని కాపాడుతుంది. మీరు వాడని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, జిమ్ మెంబర్‌షిప్‌లు లేదా ఇతర సబ్‌స్క్రిప్షన్లను రద్దు చేసుకోండి. నెలకు వందల్లో అనిపించినా, ఏడాదికి ఇవి వేల రూపాయలు ఆదా చేస్తాయి. ఇలాంటి పక్కా ప్రణాళిక, ఆలోచనతో ఉంటే.. ఎంత సంపాదించినా నెలాఖరుకు జేబు ఖాళీ కాకుండా చూసుకోవచ్చు. దీన్ని అలవాటుగా మార్చడం ముఖ్యమే, ఒక్కసారి పాటించడం సరిపోదు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..