శనివారం (సెప్టెంబర్ 27) జరిగిన ఐక్యరాజ్యసమితి (UNGA) 80వ సర్వసభ్య సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పాకిస్తాన్‌పై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. పాకిస్తాన్‌ను “ప్రపంచ ఉగ్రవాదానికి నిలయం” అని అభివర్ణిస్తూ, దశాబ్దాలుగా అంతర్జాతీయ ఉగ్రవాద దాడుల వెనుక పాకిస్తాన్ ఉందని అన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి భారతదేశం ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోందని జైశంకర్ తెలిపారు. పొరుగు దేశం ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రంగా మారిందన్న కేంద్ర మంత్రి.. దశాబ్దాలుగా, ప్రధాన అంతర్జాతీయ ఉగ్రవాద దాడుల మూలాలు ఆ దేశంతో ముడిపడి ఉన్నాయన్నారు. ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదుల జాబితాలో ఆ దేశ పౌరుల పేర్లు చాలా ఉన్నాయని కేంద్ర మంత్రి జై శంకర్ వెల్లడించారు.
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ దాడిని ప్రస్తావిస్తూ, ఈ ఏడాది ఏప్రిల్‌లో పహల్గామ్లో అమాయక పర్యాటకులను చంపడాన్ని విదేశాంగ మంత్రి తీవ్రంగా ఖండించారు. ఇది సీమాంతర ఉగ్రవాద క్రూరత్వానికి ఉదాహరణగా పేర్కొన్నారు. భారతదేశం తన ప్రజలను రక్షించడానికి ప్రతీకారం తీర్చుకుందన్నారు. పహల్గా్మ్ ఘటనకు పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టిందని ఆయన అన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం మా ప్రాధాన్యత అని కేంద్ర జైశంకర్ స్పష్టం చేశారు. మతోన్మాదం, హింస, అసహనం, బెదిరింపులను సమర్థవంతంగా తిప్పికొట్టామన్నారు. మన హక్కులను కాపాడుకుంటూనే అటువంటి ముప్పులను ధైర్యంగా ఎదుర్కోవాలి అని జైశంకర్ అన్నారు.
ఉగ్రవాదం ఒక సాధారణ ముప్పు అని, అంతర్జాతీయ సహకారాన్ని మరింతగా పెంచుకోవడం చాలా అవసరమని ఆయన అన్నారు. కొన్ని దేశాలు బహిరంగంగా ఉగ్రవాదాన్ని తమ విధానంగా స్వీకరించాయని, ఉగ్రవాద స్థావరాలు పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నప్పుడు, ఉగ్రవాదులను బహిరంగంగా కీర్తించినప్పుడు, అటువంటి వారి చర్యలను తీవ్రంగా ఖండించాలని జైశంకర్ పిలుపునిచ్చారు. ప్రపంవ్యాప్తంగా ఉగ్రవాదులకు నిధులను ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాన ఉగ్రవాదులను నిషేధించాలని, ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలు, వారికి మద్దతు ఇచ్చే వారిపై నిరంతర ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని విదేశాంగ మంత్రి అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారిని రక్షించే దేశాలు కూడా ఒకరోజు మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) తక్షణ సంస్కరణల అవసరాన్ని జైశంకర్ గుర్తు చేశారు. సంస్థను నిజంగా ప్రాతినిధ్యం వహించేలా కౌన్సిల్ శాశ్వత సభ్యత్వాన్ని విస్తరించాలని ఆయన అన్నారు. అటువంటి మండలిలో భాగం కావడం ద్వారా భారతదేశం గొప్ప బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా ఉందని విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..