ఇల్లు తాకట్టు పెట్టి.. ఎన్టీఆర్‌తో ఆ సినిమా తీసిన పద్మనాభం.. ఆ తర్వాత..

ఇల్లు తాకట్టు పెట్టి.. ఎన్టీఆర్‌తో ఆ సినిమా తీసిన పద్మనాభం.. ఆ తర్వాత..


ఇల్లు తాకట్టు పెట్టి.. ఎన్టీఆర్‌తో ఆ సినిమా తీసిన పద్మనాభం.. ఆ తర్వాత..

కమెడియన్ గా సినీ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న పద్మనాభం, కేవలం హాస్య నటనకే పరిమితం కాకుండా వైవిధ్యం కోసం పరితపించారు. 1958లో సహనటుడు వల్లం నరసింహారావుతో కలిసి రేఖ అండ్ మురళి ఆర్ట్స్ పేరుతో నాటక సంస్థను స్థాపించారు. వారి తొలి నాటకం శాంతినివాసం కాగా, కాళహస్తి మహాత్మ్యం 300 ప్రదర్శనలతో గొప్ప పేరు తెచ్చింది. కమెడియన్‌గా ఆర్థికంగా స్థిరపడిన తర్వాత, ఎన్టీఆర్, సావిత్రిల ప్రోత్సాహంతో పద్మనాభం నిర్మాతగా మారారు. 1964లో ఆయన తొలి చిత్రం దేవత రేఖ అండ్ మురళి ఆర్ట్స్ పతాకంపై రూపుదిద్దుకుంది. పద్మనాభం రూమ్ మేట్, సంగీత దర్శకుడు ఎస్.పి. కోదండపాణి నాటకాలకు సంగీతం అందించేవారు. ఒకసారి రచయిత వీటూరి వారికి ఓ కథ చెప్పారు. ఆ కథను చాలామందికి చెప్పినా సినిమా తీసేందుకు ఎవరూ ధైర్యం చేయలేకపోయారు. డబుల్ రోల్ హీరోయిన్‌తో కూడిన ఆ కథ నాటకాలకు పనికిరాదని, భారీ బడ్జెట్ అవసరమని పద్మనాభం మొదట వెనకాడారు. తాను నటనలో బిజీగా ఉండటం వల్ల నిర్మాణానికి దూరంగా ఉండాలని భావించారు. అయితే, రెండు నెలల తర్వాత కోదండపాణి ప్రేరణతో ఆ కథను సినిమాగా తీయడానికి పద్మనాభం అంగీకరించారు. ఈ కథకు ఎన్టీఆర్ హీరోగా సరిపోతారని భావించి, వీటూరిని వెంటపెట్టుకొని ఆయన ఇంటికి వెళ్లారు. నిర్మాతగా మారుతున్న తన సహనటుడిని చూసి ఎన్టీఆర్ సంతోషించారు. కథ నచ్చడంతో డేట్స్ ఇచ్చి ఆల్ ది బెస్ట్ బ్రదర్ అని భుజం తట్టారు. హీరోయిన్‌గా సావిత్రిని సంప్రదించగా, ఆమెకు కూడా కథ నచ్చింది. అయితే, ఆ సమయంలో ఆమె మూడు నెలల గర్భవతి. “ఆరు నెలలు పట్టవచ్చు, డెలివరీ అయ్యాక నటిస్తారా?” అని అడిగినప్పుడు, “మేము మూడు నెలల్లోనే పూర్తి చేస్తాం, సందేహించకండి” అని పద్మనాభం హామీ ఇచ్చారు. అడ్వాన్స్ ఇస్తుండగా జారిపడిన వంద రూపాయల నోటును సావిత్రి తీసుకొని, “ఇది మంచి శకునం, మీ సినిమా వంద రోజులు ఆడుతుంది” అని ఆశీర్వదించారు. ఆమె మాట నిజమైంది.

“ఇది ఓ ఇంటి ఇల్లాలి చుట్టూ తిరిగే కథ” కాబట్టి దేవత అనే టైటిల్ పెట్టాలనుకున్నారు. గతంలో దర్శకుడు బి.ఎన్. రెడ్డి దేవత పేరుతో ఓ సినిమా తీశారు. ఆయనను కలిసి అనుమతి కోరగా, బి.ఎన్. రెడ్డి పద్మనాభం గౌరవాన్ని మెచ్చి, ఆశీర్వదించారు. కె. హేమాంబరధరరావును దర్శకుడిగా ఎన్నుకొని, పద్మనాభం తన ఇంటిని 40,000 రూపాయలకు తాకట్టు పెట్టి చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ చిత్రంలో పద్మనాభం తన పాత్రకు సినిమా బ్యాక్ డ్రాప్‌ను ఎన్నుకున్నారు. కథలో భాగంగా, సినిమా తారలను చూడటానికి జనం ఎలా తంటాలు పడతారో చూపించారు. ఎస్.వి. రంగారావు, గుమ్మడి, రేలంగి, కాంతారావు, రమణారెడ్డి, అంజలీదేవి, షావుకారు జానకి, జమున వంటి 22 మంది ప్రముఖ తారల ఇళ్లకు వెళ్లి పద్మనాభం ఆటోగ్రాఫ్‌లు సేకరించే పది నిమిషాల దృశ్యాలు దేవత చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలుగు చిత్ర రంగంలో ఇది ఒక అరుదైన ప్రయోగం. ఈ సినిమాలో పద్మనాభం సరసన గీతాంజలి నటించారు. ఎన్టీఆర్ తల్లిదండ్రులుగా నాగయ్య, నిర్మలమ్మ కనిపించారు. చిత్ర నిర్మాణ సమయంలోనే నాగయ్యకు పద్మశ్రీ అవార్డు రావడంతో సెట్‌లో యూనిట్ సెలబ్రేట్ చేసింది. రాజనాల విలన్‌గా, నగేష్ ఫిల్మ్ డైరెక్టర్‌గా, పేకేటి ఆయన అసిస్టెంట్‌గా, రాజబాబు ప్రొడక్షన్ మేనేజర్‌గా నటించారు.

కోదండపాణి ఈ చిత్రానికి అద్భుతమైన పాటలు అందించారు. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఎన్టీఆర్, సావిత్రిలపై చిత్రీకరించిన కన్నుల్లో మిసమిసలు కనిపించని పాటలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. ఇందులో కాలేజీ లెక్చరర్ ప్రసాద్‌గా ఎన్టీఆర్ నటించారు. తన భార్య రైలు ప్రమాదంలో మరణించిందని తెలియగానే ఆయన రోదించే సన్నివేశం కోసం ఓ అద్భుతమైన నేపథ్య గీతం అవసరమని దర్శక నిర్మాతలు భావించారు. రచయిత వీటూరి 20 రోజులు ప్రయత్నించినా కుదరలేదు. చివరకు మహాకవి శ్రీశ్రీని అడిగితే, రెండే రోజుల్లో బొమ్మను చేసి, ప్రాణం పోసి, ఆడేవు నీకిది వేడుక అనే గొప్ప పాటను రాసిచ్చారు. ఈ పాటను ఎన్టీఆర్ మీద చిత్రీకరించాలి, కానీ ఆయన డేట్స్ అయిపోయాయి. ఇతర చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టమైంది. అయినప్పటికీ, పద్మనాభం అభ్యర్థన మేరకు, ఎన్టీఆర్ మూడు రోజులు నైట్ వర్క్ చేయడానికి అంగీకరించారు. వేరే షూటింగ్స్ పూర్తి చేసుకొని రాత్రి తొమ్మిది గంటలకు దేవత సెట్‌కు వచ్చేవారు. రాత్రి 12 గంటల వరకు పనిచేశారు. నిరంతరం పని చేయడంతో నిద్రలేమి ఏర్పడి, సెట్‌లో కునుకు తీసేవారు. రెయిన్ ఎఫెక్ట్ షాట్స్ కోసం, డైరెక్టర్ హేమాంబరధరరావు “సార్” అని పిలవగానే, ఎన్టీఆర్ “రెడీ బ్రదర్” అని పక్కనే ఉన్న బిందెలో నీళ్లు నెత్తిన పోసుకుని కెమెరా ముందుకు వచ్చేవారు. ఇలా ఎన్టీఆర్ అంకితభావంతో ఆ పాట పూర్తి చేశారు. దేవత చిత్రం ఘన విజయం సాధించింది. అక్కడి థియేటర్ల కోరిక మేరకు 50 రోజుల వేడుకను రాజమండ్రిలో నిర్వహించారు, యూనిట్ మొత్తం అక్కడికి వెళ్ళింది.

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *