
యుద్ధం జరుగుతోంది సరే, మరి దాని ఇంపాక్ట్ ఏంటి? స్టాక్‌మార్కెట్లు పేకమేడల్లా పడిపోతున్నాయి, క్రూడాయిల్ ధరలు కుతకుత అంటున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం, మధ్యప్రాచ్యంలో గందరగోళం మధ్య, భారత స్టాక్ మార్కెట్ కుదేలైంది. వారంలో చివరి ట్రేడింగ్ రోజు శుక్రవారం (మార్చి 06) గణనీయమైన క్షీణతను నమోదు చేసింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి భయం భారత స్టాక్‌మార్కెట్‌లో బ్లడ్‌బాత్ క్రియేట్ చేశాయి. ఇటు సెన్సెక్స్..అటు నిఫ్టీ భారీగా నష్టపోవడంతో ఇన్వెస్టర్లు కుదేలయ్యారు. బిఎస్ఇ సెన్సెక్స్ 1,097 పాయింట్లు (1.37%) తగ్గి 78,918.90 వద్ద ముగియగా, ఎన్ఎస్ఇ నిఫ్టీ 50 కూడా 315.45 పాయింట్లు (1.27%) తగ్గి 24,450.45 వద్ద ముగిసింది.
పెట్టుబడిదారులు మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో దాదాపు రూ. 3 లక్షల కోట్లు కోల్పోయారు. ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలు ముడి చమురు ధరలు పెరగడం, విదేశీ మార్కెట్ల నుండి బలహీనమైన సంకేతాలు, పెట్టుబడిదారులు భారీగా లాభాల బుకింగ్ చేయడం అని భావిస్తున్నారు. గత వారాంతంలో, అమెరికా, ఇజ్రాయెల్ – ఇరాన్‌పై దాడులు ప్రారంభించాయి. ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులతో ప్రతీకారం తీర్చుకుంటోంది. హార్ముజ్ జలసంధి ద్వారా చమురు సరఫరాలకు అంతరాయం కలిగించింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు $80 కంటే ఎక్కువగా పెరిగాయి. అయితే, శుక్రవారం ఉదయం ఫ్యూచర్స్ ట్రేడ్‌లో బ్రెంట్ ముడి చమురు బ్యారెల్‌కు 2.4% తగ్గి $83.21కి చేరుకుంది. WTI ముడి చమురు బ్యారెల్‌కు 3% తగ్గి $78.54 వద్ద ట్రేడవుతోంది.
ఇరాన్ యుద్ధం, చమురు ధరలు పెరగడం వల్ల ఈ వారం US స్టాక్ మార్కెట్లు సైతం కుప్పకూలిపోయాయి. దీని తరువాత, శుక్రవారం US ఫ్యూచర్స్ చాలావరకు స్థిరంగా ఉన్నాయి. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్‌తో అనుసంధానించిన ఫ్యూచర్స్ 103 పాయింట్లు అంటే 0.2% పెరిగాయి. S&P 500 ఫ్యూచర్స్ 0.1% పెరిగాయి. నాస్‌డాక్ 100 ఫ్యూచర్స్ కూడా 0.1% పెరిగాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..