
సాధారణంగా చాలా మంది జంతువుల మీద ప్రేమతో కుక్కలు, పిల్లులు లేదా చేపలను పెంచుకుంటూ ఉంటారు. అయితే, ఈ పెంపుడు జంతువులు కేవలం వినోదానికే కాదు, ఇంటికి సానుకూల శక్తిని తీసుకురావడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ప్రకృతికి, మానవులకు మధ్య ఉండే సంబంధాన్ని వివరిస్తూ, కొన్ని ప్రత్యేక జంతువులను పెంచుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి, అదృష్టం కలిసి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఆ అదృష్ట జంతువులు ఏవో ఇప్పుడు చూద్దాం..
కుక్క: విశ్వాసానికి మారుపేరు.. లక్ష్మీదేవి కటాక్షం
హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం కుక్కను కాలభైరవుని వాహనంగా లేదా సేవకుడిగా పరిగణిస్తారు. ఇంట్లో కుక్కను పెంచి, దానికి సేవ చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. ఇది కేవలం ఇంటికి రక్షణ ఇవ్వడమే కాకుండా, దుష్ట శక్తులను దరిచేరనీయకుండా కాపాడుతూ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తుంది.
చేపలు
వాస్తు ప్రకారం ఇంట్లో చేపల అక్వేరియం ఉండటం శుభప్రదం. ముఖ్యంగా గోల్డెన్ ఫిష్ అదృష్టానికి చిహ్నం. అక్వేరియంను ఇంటికి ఈశాన్య లేదా ఆగ్నేయ దిశలో ఉంచడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోయి, కుటుంబంలో పురోగతి కనిపిస్తుంది.
కుందేలు
చూడటానికి ఎంతో ముద్దుగా ఉండే కుందేళ్లు ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని పీల్చుకుంటాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమను పెంచడానికి, ఇంట్లో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడానికి కుందేళ్లను పెంచుకోవడం ఉత్తమం.
తాబేలు
తాబేలును సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు. ఇంట్లో తాబేలు ఉండటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలిగి, ధన ప్రవాహం పెరుగుతుంది. ఒకవేళ బతికున్న తాబేలును పెంచుకోలేకపోతే.. లోహం లేదా స్ఫటికంతో చేసిన తాబేలును ఉత్తర దిశలో ఉంచడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
పెంపుడు జంతువులను కేవలం వాస్తు కోసమే కాకుండా వాటిపై ప్రేమతో, బాధ్యతతో పెంచుకున్నప్పుడే ఆ ఇల్లు నందనవనంలా మారుతుంది. మీ ఇంట్లో సానుకూల మార్పులు కావాలనుకుంటే, వీటిలో మీకు నచ్చిన జీవులకు ఆశ్రయం కల్పించి చూడండి.
(గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. పురాణాలు, జ్యోతిష్యశాస్త్రం సూచించిన ఈ నియమాలను పాటించడం వల్ల మానసిక ప్రశాంతత, క్రమశిక్షణ లభిస్తాయని భక్తుల విశ్వాసం.)