వామనుడు బలిచక్రవర్తిని మూడడుగులు అడిగాడు. ఓస్.. మూడడుగులే కదా అని తేలిగ్గా తీసుకున్నాడట. బలిని పాతాళంలోకి తొక్కి, నింగి-నేల ఆక్రమించేశాడు. కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు ఐదడుగులు అడుగుతోంది. ఆల్మట్టి డ్యామ్ కోసం..! అక్కడ తొక్కితే.. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. ఈ మూడు రాష్ట్రాల ప్రజల గొంతు తడారిపోతుంది. ఆల్మట్టి జస్ట్ ఐదు అడుగులు పెరిగితే.. తెలంగాణ కృష్ణానది పరివాహకం మొత్తం ఎడారిగా మారిపోతుంది. కట్టిన ప్రాజెక్టులు క్రికెట్ ఆడుకునే గ్రౌండ్స్‌గా మారిపోతాయి. తెలంగాణలోనే నీళ్లు పారకపోతే ఇక ఏపీ పరిస్థితి..! రాయలసీమ కొన వరకు కృష్ణా నది నీళ్లు పారుతున్నాయి. వాటి సంగతేంటి? అసలు.. ఈ ఐదడుగుల రగడ ఏంటి? ఏపీ బనకచర్ల కడితే.. కృష్ణాలో 64 టీఎంసీలు వెనక్కిచ్చేయాలంటోంది కర్ణాటక. ఎక్కడో ఆల్మట్టికి, రాయలసీమలోని బనకచర్లకు లింక్ ఏంటి? అన్నదీ తెలుసుకుందాం..
నైరుతి మొదలవడం ఆలస్యం.. గోదావరి ఉప్పొంగుతుంటుంది. దాదాపుగా జూన్‌లోనే గోదావరి ప్రాజెక్టుల్లో జలకళ కనిపిస్తుంది. ఓవైపు ఇలా ఉంటే.. కృష్ణానది మాత్రం ఎడారిలా కనిపిస్తుంటుంది. ప్రాజెక్టులు డెడ్‌స్టోరేజీలో ఉంటాయి. ఒకే రాష్ట్రంలో రెండు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తాయి. కారణమేంటి? గోదావరితో పోల్చితే కృష్ణానది ప్రాజెక్టులకి రెండు నెలలు ఆలస్యంగా నీళ్లు రావడమే. దీనికి కారణం.. ఎగువన కర్ణాటకలో కట్టిన ప్రాజెక్టులే. కన్నడనాట జోరు వానలు, వరదలు ముంచెత్తుతున్నా.. తెలంగాణ గడ్డపైకి మాత్రం చుక్కనీరు రాదు. కారణం.. కర్ణాటక నిర్మించిన ఆల్మట్టి ప్రాజెక్ట్. ఆల్రడీ కృష్ణా ప్రాజెక్టులకి ఎంత నష్టం జరుగుతోందో చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఆల్మట్టి డ్యామ్ ఎత్తు మరో ఐదడుగులు పెంచుతోంది సిద్ధరామయ్య సర్కార్.
గంగానది మొత్తాన్ని పుక్కిట పట్టాడట జాహ్ను మహర్షి. అలా.. ఏకంగా కృష్ణా నది మొత్తాన్ని చుక్క నీరు దిగువకు వదలకుండా ఒడిసి పట్టాలనుకుంటోంది కర్ణాటక ప్రభుత్వం. 1997లో ఆల్మట్టి డ్యామ్ నిర్మించే సమయంలోనే కర్ణాటక ఆలోచనపై పెద్ద గొడవ జరిగింది. అంత పెద్ద డ్యామ్ కడితే శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు నీళ్లెలా అని ప్రశ్నించింది అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. అన్నీ పరిశీలించిన సుప్రీం.. 160 అడుగుల సామర్ధ్యంతో మాత్రమే ఆల్మట్టిని నిర్మించాలని చెప్పింది. అప్పుడు ఎంటర్ అయింది బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్. అన్ని లెక్కలూ వేసిన ఆ ట్రైబ్యునల్.. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్టుగా 160 అడుగులు కాదు.. ఏకంగా 524 అడుగుల వరకు ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుకోవచ్చు అని తీర్పు చెప్పింది. ఆ ఒక్క ఆర్డర్‌తో ఆల్మట్టిని నిర్మించేసి 2005 నాటికి పూర్తి చేసింది. బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ చెప్పినట్టుగా ఆల్మట్టిని 524 అడుగుల ఎత్తు వరకు కట్టలేదు కర్ణాటక. 519 అడుగుల వరకే నిర్మించింది. అయినా సరే.. ఏ కాలంలోనైనా గానీ ఆల్మట్టిలో దాదాపు 130 టీఎంసీల వరకు నీటి స్టోరేజ్‌కి అవకాశం ఏర్పడింది. చుట్టూ కెనాల్స్ నిర్మించి, ఎప్పటికప్పుడు నీటిని తరలిస్తూనే పోతోంది కర్ణాటక. ఎప్పుడైతే ఆల్మట్టి నిర్మాణం పూర్తైందో ఇక అప్పటి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు నీటి కష్టాలు మరింత పెరిగాయి.
519 అడుగుల డ్యామ్ ఎత్తు కారణంగా ప్రతి సీజన్‌లోనూ నష్టం జరుగుతున్నా.. ఆ గాయాన్ని క్రమంగా మరిచిపోతూ, అలవాటు పడిపోతూ వస్తున్నాయి తెలుగు రాష్ట్రాలు. ఎలాగూ తెలుగు రాష్ట్రాలు ఊరుకున్నాయి కదా అనుకుందేమో కర్ణాటక.. 519 అడుగులుగా ఉన్న డ్యామ్ ఎత్తును 524 అడుగులకు పెంచే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆ ప్లాన్ ఇప్పటిది కాదు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా అని ప్లాన్ చేయలేదు కర్ణాటక. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచేందుకు ఎడతెగని ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
ఆల్మట్టి ఎత్తు పెంచడానికి కర్ణాటక చాలా సీరియస్‌గా ప్రయత్నిస్తుండడంతో.. 2013లో అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం… కృష్ణా వాటర్ డిస్‌ప్యూట్స్ ట్రైబ్యునల్-2 ఇచ్చిన అనుమతిపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. ఆల్మట్టి ఎత్తు పెంచితే.. తెలుగు రాష్ట్రాల రైతులపై అత్యంత తీవ్రమైన ప్రభావం పడుతుందని వాదించి, సుప్రీంకోర్టు నుంచి స్టే సాధించింది. 2014లో తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా.. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి ఆ స్టే కొనసాగేలా చేశారు. అయినా సరే.. కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నాలు ఆపలేదు. గ్రౌండ్ వర్క్ చేస్తూనే పోయింది. 2014 డిసెంబర్‌లో ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడం కోసం ఒక డీపీఆర్ తయారీకి టెండర్లు పిలిచింది. ఆ టెండర్లలో తక్కువకు కోట్ చేసిన వ్యాప్కోస్‌కు బాధ్యతలు అప్పగించింది.
ఆ సమయంలోనే, 524 అడుగులకు డ్యామ్ ఎత్తు పెంచితే.. సుమారు 76వేల 294 ఎకరాలు మునిగిపోతాయని రిపోర్ట్ ఇచ్చింది. మొత్తం 22 గ్రామాలకు చెందిన 23వేల 561 మంది నిర్వాసితులుగా మారతారని వ్యాప్కోస్ తన అధ్యయనంలో తేల్చింది. ఆ రిపోర్ట్‌ను 2016లోనే కర్ణాటక ప్రభుత్వం ఆమోదించింది కూడా. సుమారు 30వేల 143 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అప్పట్లోనే అంచనా వేసింది. డ్యామ్ ఎత్తు పెంచితే గ్రామాలు మునిగిపోతాయి కాబట్టి భూసేకరణ, పునరావాస పనులను కూడా వెంటనే మొదలుపెట్టింది. దాదాపుగా టెండర్లు పిలవడం ఒక్కటే తరువాయి అనేంతదాకా పనులను వేగవంతం చేసింది కర్ణాటక సర్కార్.
మరి ఎందుకు ఆగిపోయినట్టు కర్ణాటక ప్రభుత్వం. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఎత్తు పెంపుపై స్టే ఇచ్చింది కాబట్టి.. ఆ తీర్పును కాదని పనులు మొదలుపెడితే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. సో, ఎవరైనా కోర్టుకు వెళ్తే చాలు.. ఆల్మట్టి పనులు ఆగిపోతాయి. బట్… కర్ణాటక ప్లాన్స్ కర్ణాటకకు ఉన్నాయి.
ఆల్మట్టికి మేజర్ అడ్డంకి మహారాష్ట్రనే. డ్యామ్ ఎత్తు ఐదడుగులు పెంచితే మహారాష్ట్రలోని రెండు జిల్లాలు మునిగిపోతాయి. కాని, కర్ణాటక మాత్రం.. ‘మీ రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరుగుతాయి, మీకే లాభం’ అని ఆశ చూపిస్తోంది. మునిగిపోయే ప్రాంతాలకు నష్టపరిహారంగా ఎంతైనా ఖర్చు చేస్తామని చెబుతోంది. కర్ణాటక ఎంత బుజ్జగించినా మహారాష్ట్ర ఒప్పుకోలేదు. ఆ ప్రయత్నాలు ఆపకపోతే.. సుప్రీంకోర్టుకు వెళ్తామని హెచ్చరించింది. ఆ తరువాతే.. తెలంగాణకు ఈ విషయం తెలిసింది.
ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడానికే ముందుకెళ్తున్న కర్ణాటక.. ఆ పనులన్నీ చాపకింద నీరులా చేసుకెళ్తోంది. రెండు నెలల క్రితమే.. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు నిర్ణయానికి కర్ణాటక కేబినెట్ ఆమోదించిందంటున్నారు. రెండు నెలల క్రితం జరిగిన ఈ మ్యాటర్.. చాలా ఆలస్యంగా బయటకు తెలిసింది. నిజానికి కర్ణాటక ప్రయత్నాలను ముందుగా పసిగట్టింది మహారాష్ట్రనే. వెంటనే ఆ ప్రయత్నాలు ఆపకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామని హెచ్చరించింది. ఆ తరువాతనే తెలంగాణకు ఈ విషయం తెలిసిందంటున్నారు.
కర్ణాటక ప్రయత్నాలను తెలుగు రాష్ట్రాల్లోని ఏ ఒక్కరూ సమర్ధించడం లేదు. ఏ ఒక్క పార్టీ కూడా కర్ణాటక నిర్ణయానికి మద్దతు ఇవ్వలేదు. కారణం.. ఆల్మట్టి డ్యామ్‌ను ఐదడుగులు పెంచితే.. ముందుగా తెలంగాణలోని కృష్ణా పరివాహక ప్రాంతాలన్నీ ఎడారిగా మారతాయి. దాదాపు 130 టీఎంసీల నీళ్లు.. ఆల్మట్టి గేట్లకు అవతలే ఆగిపోతాయి. అదే జరిగితే.. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలు ఎడారులుగా మారతాయి. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ దాదాపుగా ఎందుకూ పనికిరాకుండా పోతుంది. తుమ్మిళ్ల, డిండి, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులకు తీవ్ర నష్టం జరుగుతుంది.
ఆల్మట్టి ఎత్తు పెంపుతో కృష్ణా జలాలు అసలు తెలంగాణలోకే అడుగు పెట్టని పరిస్థితి ఉంటుంది. కొన్ని సీజన్లలో సెప్టెంబర్ నెలాఖరకు గానీ కృష్ణా నీళ్లు తెలంగాణలోని అడుగుపెట్టలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆల్మట్టి డ్యామ్ ఎత్తును ఐదడుగులు పెంచితే.. జూరాలకు నీళ్లు రావు. జూరాల నిండి, అక్కడి గేట్లు ఎత్తితేనే శ్రీశైలం రిజర్వాయర్ నిండుతుంది. సో, శ్రీశైలం నిండదు. శ్రీశైలం నుంచి నీళ్లు వదిలితేనే నాగార్జున సాగర్‌లో జలకళ కనిపిస్తుంది. అంటే, సాగర్ ఒట్టిపోవాల్సిందే. ఆ సాగర్ నీళ్లే పులిచింతల ప్రాజెక్ట్ నిండుకుండను చేస్తుంది. అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు నీళ్లు వస్తాయి. సో, జస్ట్ ఐదుడగుల ఎత్తు పెంచి ఆల్మట్టిలో నీళ్లు ఆపితే.. ఈ ప్రాజెక్టులన్నీ క్రికెట్ గ్రౌండ్స్‌గా మారడం ఖాయం.
ఆల్మట్టి నుంచి నారాయణ్‌పూర్, నారాయణ్‌పూర్ నుంచి జూరాలకు మొదట నీళ్లు రావాలి. ఆ జూరాలను బేస్ చేసుకునే నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్‌ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. కర్ణాటక గనక ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచితే ఆ లిఫ్ట్ స్కీమ్ నిరర్ధకం అవుతుంది. పక్క రాష్ట్రం, అందులోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం ఇంత చేస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నాయి విపక్షాలు. దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోందని బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఓవైపు ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచేందుకు కర్ణాటక కేబినెట్ నిర్ణయం తీసేసుకుందని తెలిసినా.. ఇప్పటికీ అడ్డుకునే ప్రయత్నమే చేయలేదు అనేది బీఆర్ఎస్ ఆరోపణ.
కర్ణాటక చర్యతో ప్రాజెక్టులు నిండడం తరువాత సంగతి. ముందు తెలంగాణ భూభాగం నుంచి కృష్ణా నది మొత్తం కనుమరుగయ్యే ప్రమాదం ఉందంటున్నారు కవిత. ఇప్పటికైనా కృష్ణా ట్రైబ్యునల్ ముందుకు వెళ్లి తెలంగాణకు జరిగే నష్టాన్ని వివరించాలని కవిత డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెరగకుండా అడ్డుకుంటామని హామీ ఇస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ముందుగా.. కర్ణాటక సర్కార్ చేస్తున్న భూసేకరణకే అడ్డుపడతామని చెప్పుకొచ్చారు. సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న ఆల్మట్టి కేసుపై సీనియర్ న్యాయవాదులను నియమించి, కర్ణాటక ప్రయత్నాలు ఆపుతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
కృష్ణా నీటిపై ఏపీ అసెంబ్లీలోనూ డిస్కషన్ జరిగింది. ఆల్మట్టి నుంచి అదనంగా 100 టీఎంసీలకు పైగా నీటిని వాడుకుంటానంటోంది కర్ణాటక. తెలంగాణ సైతం 16 ప్రాజెక్టులకు రిపోర్టులు తయారు చేసింది. జూరాల నుంచి 100 టీఎంసీలు, నెట్టెంపాడు ఫేజ్-2 ద్వారా 4 టీఎంసీలు, కల్వకుర్తి నుంచి 16 టీఎంసీలు.. ఇలా కృష్ణా నీటిలో 150 టీఎంసీలు తరలించేందుకు తెలంగాణ ప్లాన్ చేసుకుంది. మరి.. తమ పరిస్థితేంటని ప్రశ్నిస్తోంది ఏపీ.
దక్షిణ తెలంగాణకు ఏకైక వర ప్రదాయిని.. కృష్ణానది మాత్రమే. పైగా తెలంగాణ ఎక్కువ భాగం కృష్ణానది బేసిన్‌లోనే ఉంటుంది. తెలంగాణ మీదుగానే కృష్ణమ్మ ప్రయాణిస్తుంది. అయినా సరే.. ఇప్పటి వరకు కృష్ణా నీటిని ఏనాడు సమృద్దిగా వాడుకున్నది లేదు తెలంగాణ. అటు ఏపీ కూడా కృష్ణా నీటిపై ఆశలు పెట్టుకునే.. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 15కు పైగా ప్రాజెక్టులు కట్టుకుంది. ఇప్పుడు అవన్నీ మైదానాలుగా మారుతున్నట్టే.
అసలు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వాటాల లెక్కలే పరిష్కారం అవలేదు. ఏపీకి 511 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంపీలు కేటాయించింది బ్రిజేశ్ ట్రైబ్యునల్. బట్.. కేటాయించిన ఆ 299 టీఎంసీలు కూడా తెలంగాణకు దక్కడం లేదు. రాష్ట్రంగా ఏర్పడి పదేళ్లు దాటినా.. పూర్తి స్థాయిలో కృష్ణా నది నీటిని వినియోగించుకునే అవకాశం రావడం లేదు. పైగా అప్పర్ కృష్ణాలో ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా.. రెండు తెలుగు రాష్ట్రాల వరకు వచ్చే సరికి దామాషా అంటూ లెక్కలు కడతారు. ఆ కారణంగా తెలంగాణనే ఎక్కువగా నష్టపోతోంది.
ఇదిలా ఉంటే.. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపుపై చర్చ జరుగుతున్న సమయంలో.. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న బనకచర్లను ప్రత్యేకంగా ప్రస్తావించింది కర్ణాటక ప్రభుత్వం. ఒకవేళ బనకచర్ల ప్రాజెక్ట్ పూర్తి చేస్తే.. కృష్ణాజలాల్లో తమ వాటా కింద 64.75 టీఎంసీలు ఇవ్వాల్సిందేనంటోంది. దీనిపై కేంద్ర జలశక్తి శాఖకి సెప్టెంబర్ 17న లేఖ కూడా రాసింది కర్ణాటక ప్రభుత్వం. మొత్తానికి.. ఆల్మట్టి ఎత్తు పెంపుకు, రాయలసీమకు నీళ్లిచ్చే బనకచర్లకు లింక్ పెట్టింది కర్ణాటక.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..