
మానవ శరీరం ఏ సమయంలోనైనా పాడైపోయే ఒక యంత్రం లాంటిది. కాబట్టి, మనం యంత్రాలను ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో.. మన సొంత శరీరాలను కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే, దాని పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఇటీవల ఒక వ్యక్తి విషయంలో నిర్ధారణ అయింది. ఆ మనిషి తల వెనుక మెడపై రెండవ తల పెరిగింది. ఇది ఎలా సాధ్యమవుతుందని మీరు ఆశ్చర్యపోవచ్చు? కానీ, ఆ వ్యక్తి మెడపై అది చాలా పెద్దదిగా పెరిగి తల పరిమాణంలో మారింది. దాదాపు 16 సంవత్సరాల పాటు అది అతని శరీరంలో ఒక భాగంగా ఉంది. చివరకు అతికష్టం మీద వైద్యులు దాన్ని తొలగించారు. ఇంతకీ ఏంటా రెండో తలకాయ అన్నది తెలియాలంటే పూర్తి డిటెల్స్లోకి వెళ్లాల్సిందే…
ఒక రష్యన్ వ్యక్తి మెడపై ఒక పెద్ద కణితితో దాదాపు 16 సంవత్సరాలు జీవించాడు. చివరకు ఇటీవల సర్జరీ చేసిన వైద్యులు అతి కష్టంమీద దానిని తొలగించారు. 65 ఏళ్ల ఆ వ్యక్తి రష్యాలోని కిరోవ్ నివాసి. అతని మెడపై కణితి చాలా పెద్దదిగా పెరిగింది. అది అతని తల పరిమాణంలో ఉంది. చాలా కాలంగా కణితి దానంతట అదే తగ్గిపోతుందని అతను భావించాడు. ఇంటి నివారణలు, ఇరుగుపొరుగు వారు చెప్పే వైద్యంతో చికిత్స చేయడానికి ప్రయత్నించాడు. కానీ, ఫలితం లేకపోయింది. పదహారు సంవత్సరాలు గడిచాయి. కణితి పెరుగుతూనే ఉంది. తలపై అతడు మోయలేనంత భారంగా మారింది. దాంతో వైద్యులను సంప్రదించాడు.
కిరోవ్ ప్రాంతీయ క్లినికల్ హాస్పిటల్లోని వైద్యులు ఈ కేసుతో ఆశ్చర్యపోయారు. అతన్ని పరిక్షీంచిన వైద్యులు ఆ కణితి లిపోమా అని నిర్ధారించారు. లిపోమా అనేది చర్మం, కండరాల పొర మధ్య నెమ్మదిగా ఏర్పడే కొవ్వు ముద్ద. ఇది సాధారణంగా మృదువుగా, చిన్నగా ఉంటుంది. 1-2 అంగుళాల వెడల్పు ఉంటుంది. అయితే, కొన్ని సందర్భాల్లో ఇది పెరిగి ప్రమాదకరంగా మారవచ్చు.
మాయో క్లినిక్ ప్రకారం, లిపోమా పెరిగినప్పుడు ఎటువంటి ఇంటి నివారణలు లేదా లేపనాలు పనిచేయవని చెప్పారు. శస్త్రచికిత్స ద్వారా తొలగించడమే ఏకైక పరిష్కారంగా వెల్లడించారు.. ఈ రష్యన్ వ్యక్తి కేసు మరింత తీవ్రమైనది. ఎందుకంటే కణితి మెడలోని ముఖ్యమైన నరాలు, రక్త నాళాలకు చాలా దగ్గరగా ఉంది. ఈ ప్రాంతాన్ని సర్వైకల్ ప్లెక్సస్ అని పిలుస్తారు. ఇది వెన్నుపాముకు అనుసంధానించబడి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో చిన్న పొరపాటు కూడా రోగి ప్రాణాలను బలితీసుకుంటుందని చెప్పారు.
ఈ సర్జరీ డాక్టర్లకు పెను సవాలుతో కూడుకున్నది. కణితిని తొలగించిన తర్వాత వారు మొదట రోగి అసలు మెడ స్థానాన్ని అంచనా వేశారు. చాలా జాగ్రత్తగా ఆపరేషన్ పూర్తి చేశారు. చిన్న పొరపాటు కూడా ప్రాణాంతకం అయ్యేది. కానీ, వైద్యుల కృషి, శ్రమతో రోగికి కొత్త జీవితం లభించింది. అటువంటి సందర్భాలలో సకాలంలో చికిత్స చాలా కీలకమని వైద్యులు స్పష్టంగా పేర్కొన్నారు. రోగి చాలా కాలం పాటు ఇంటి నివారణలపై ఆధారపడటం కొనసాగిస్తే, పరిస్థితి ప్రాణాంతకం కూడా కావచ్చునని హెచ్చరిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..