దేవతల భూమిగా పేరుగాంచిన ఉత్తరాఖండ్ రాష్ట్రం.. అనేక పవిత్రక్షేత్రాలు, ఇతిహాసాలు, ఆధ్యాత్మిక సంపదకు నిలయం. ఈ పవిత్ర భూమిలోని ప్రసిద్ధ క్షేత్రాలలో ఒకటి జగేశ్వర్ ధామ్ (Jageshwar Dham). అల్మోరా పట్టణం నుంచి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలోని కుబేర ఆలయం ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కలిగి ఉంది. రావణుడి సవతి సోదరుడు, సంపదకు అధిపతి అయిన కుబేరుడికి అంకితమైన ఈ ఆలయం సుమారు 9వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తారు. ఇక్కడ కుబేరుడు ఏకముఖ శివలింగంలో శక్తి రూపంగా పూజించబడుతున్నాడని విశ్వసిస్తారు. భక్తులు ఆయన ఆశీర్వాదాలు ఆర్థిక ఇబ్బందులను తొలగించి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాయని గాఢంగా నమ్ముతారు. అందుకే ప్రతి నెలా వేలాది మంది యాత్రికులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తుంటారు.