
మన ఇళ్లలో వంట కోసం ఉపయోగించే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు, ఆక్సిజన్ సిలిండర్లు అన్నీ గుండ్రటి ఆకారంలోనే ఉంటాయి. కానీ, అవి ఎందుకు అలా తయారు చేస్తారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? ఈ గుండ్రటి ఆకారం కేవలం తయారీ సౌలభ్యం కోసం కాదు.. దీని వెనుక అతి ముఖ్యమైన శాస్త్రీయ, భద్రతా కారణాలు ఉన్నాయి. ఎల్‌పీజీ గ్యాస్‌ను సిలిండర్‌లో అధిక ఒత్తిడితో నిల్వ చేస్తారు. గుండ్ర సిలిండర్ ఆకారం ఉన్నప్పుడు ఆ ఒత్తిడి సిలిండర్ మొత్తం ఉపరితలంపై సమానంగా పంచబడుతుంది. దీంతో సిలిండర్‌పై ఎక్కడా అధిక ఒత్తిడి పడకుండా ఉంటుంది. కానీ, సిలిండర్ చతురస్రాకారంలో లేదా మూలలతో ఉంటే, ఆ మూలల వద్ద ఒత్తిడి ఎక్కువగా కేంద్రీకృతమవుతుంది. ఇది ప్రమాదాలకు దారితీయవచ్చు.
గుండ్రటి ఆకారం ఉండటం వల్ల సిలిండర్ బలంగా ఉంటుంది. బయట నుంచి వచ్చే దెబ్బలను కూడా సులభంగా తట్టుకోగలదు. అందుకే ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ నిల్వ చేయడానికి ఎక్కువగా సిలిండర్ ఆకారంలోని ట్యాంకులను ఉపయోగిస్తారు.
ఇంకో ముఖ్యమైన కారణం తయారీ సౌలభ్యం. గుండ్రటి ఆకారంలో ఉన్న లోహపు ట్యాంకులను తయారు చేయడం సులభం. అలాగే వాటిని నిల్వ చేయడం, తరలించడం కూడా సౌకర్యంగా ఉంటుంది. భద్రత పరంగా కూడా ఈ ఆకారం చాలా ముఖ్యమైనది. ఒత్తిడి సమానంగా పంచబడడం వల్ల సిలిండర్‌లో చీలికలు లేదా పగుళ్లు ఏర్పడే అవకాశాలు తగ్గుతాయి. అందుకే గ్యాస్ సిలిండర్లను ఇంజినీర్లు ప్రత్యేకంగా ఈ రూపంలోనే రూపొందిస్తారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..